300మంది వడ్డెర సోదరులతో ఆళ్ల మురళి రైస్ మిల్ వద్ద ఆందోళన..
- ఎన్నో ఏండ్ల నుండి పార్టీ కోసం పనిచేస్తున్నా..
- లక్షల రూపాయలు సొంత డబ్బు ఖర్చు పెట్టుకున్నా..
- నిన్న మొన్న చేరిన వారికి టికెట్ ఇస్తారా..?
- నిజమైన కాంగ్రెస్ వాదులపై అన్యాయం
- వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు, 53వ డివిజన్ నాయకులు పల్లపు వెంకటేశ్వర్లు ఆవేదన
- 300మంది వడ్డెర సోదరులతో ఆళ్ల మురళి రైస్ మిల్ వద్ద ఆందోళన..
కొత్తగూడెం :
పార్టీని నమ్ముకుని పనిచేసిన తనకు తీవ్ర అన్యాయం జరిగిందని 53వ డివిజన్ కాంగ్రెస్ నాయకుడు, వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు పల్లపు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. వార్డులో పార్టీ బలోపేతం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసి, చిన్న కార్యక్రమం నుంచి పెద్ద ఉద్యమం వరకు ముందుండి నడిపించినా, టికెట్ విషయంలో తన కష్టాన్ని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు.
ఏళ్ల తరబడి కాంగ్రెస్ జెండాను మోస్తూ, పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన వారిని పక్కనబెట్టి, నిన్న మొన్న చేరిన వారికి టికెట్లు ఇవ్వడం బాధాకరమని అన్నారు. ఇది కేవలం తనకే కాదు… పార్టీ కోసం నిజాయితీగా పనిచేసిన అనేక మంది కాంగ్రెస్ కార్యకర్తలకు జరిగిన అన్యాయమని స్పష్టం చేశారు. టికెట్ పంపకాలలో నిబద్ధత, త్యాగం, ప్రజాసేవకు విలువ లేకుండా పోయిందని, అవకాశవాద రాజకీయాలకు కాంగ్రెస్ లో చోటిచ్చినట్లుగా కనిపిస్తోందని తీవ్ర విమర్శలు చేశారు. ఇలాంటి నిర్ణయాలు పార్టీని బలహీనపరుస్తాయని హెచ్చరించారు.
ఈ అన్యాయానికి నిరసనగా 300 మంది వడ్డెర సోదరులతో కలిసి ఆళ్ల మురళి రైస్ మిల్లు వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. వడ్డెర వర్గానికి న్యాయం చేయాలని, నిజమైన కాంగ్రెస్ వాదుల కష్టాన్ని గుర్తించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం స్పందించి, నిబద్ధతతో పనిచేసిన నాయకులకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో కాంగ్రెస్ లో అసంతృప్తి మరింత పెరిగే ప్రమాదం ఉందని పల్లపు వెంకటేశ్వర్లు హెచ్చరించారు.