ప్రజాపాలనలో క్రీడారంగానికి పెద్దపీట
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం క్రీడారంగ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గురువారం గణపురం మండలం చెల్పూరు ప్రభుత్వ హైస్కూల్ మైదానంలో నిర్వహించిన సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడా పోటీలను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికితీసి ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి క్రీడలు ముఖ్యమని పేర్కొన్నారు. సీఎం కప్ పోటీల ద్వారా గ్రామీణ విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించి రాష్ట్ర, జాతీయ స్థాయిలలో గుర్తింపు పొందే అవకాశం లభిస్తుందని అన్నారు.విద్యార్థులు క్రీడలను కేవలం వినోదంగా కాకుండా జీవితంలో శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించే సాధనంగా చూడాలని సూచించారు. పోటీల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించి క్రమశిక్షణ, కృషి, పట్టుదలతో ముందుకు సాగితే విజయాలు సాధ్యమవుతాయని ఎమ్మెల్యే అన్నారు. క్రీడల ద్వారా వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చెందుతాయని ఆయన పేర్కొన్నారు.ప్రభుత్వం క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి, గ్రామీణ స్థాయిలో మైదానాల అభివృద్ధి, పరికరాల సమకూర్పు వంటి అంశాలకు ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు. యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, క్రీడాకారులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు