భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులోకి 'ఎమ్మారై' సేవలు
వర్చువల్ విధానంలో ప్రారంభించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి
హాస్పిటల్లో రిబ్బన్ కట్ చేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు,కలెక్టర్ రాహుల్ శర్మ
పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం.. ఇకపై వరంగల్,హైదరాబాద్ వెళ్లే అవస్థలు తప్పినట్లే!
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో నూతనంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక ఎమ్మారై మెషిన్‌ను మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి వర్చువల్ (వీడియో కాన్ఫరెన్స్) విధానంలో ఘనంగా ప్రారంభించారు.జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్థానిక కార్యక్రమంలో భూపాలపల్లి శాసనసభ్యులు (ఎమ్మెల్యే) గండ్ర సత్యనారాయణ రావు,జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మలు ముఖ్య అతిథులుగా హాజరై,ఎమ్మారై కేంద్రం వద్ద రిబ్బన్ కట్ చేసి ఈ సేవలను అధికారికంగా ప్రజలకు అంకితం చేశారు.
పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్య సేవలు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ.. భూపాలపల్లి జిల్లా ప్రజలకు నాణ్యమైన, కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు.గతంలో అత్యవసర పరిస్థితుల్లో ఎమ్మారై స్కాన్ కోసం ఇక్కడి రోగులు వరంగల్ లేదా హైదరాబాద్ లాంటి సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని, వేలాది రూపాయలు ఖర్చు పెట్టలేక పేదలు ఇబ్బంది పడేవారని గుర్తుచేశారు.ఇప్పుడు జిల్లా కేంద్రంలోనే అత్యాధునిక ఎమ్మారై మెషిన్ అందుబాటులోకి రావడం వల్ల స్థానిక ప్రజలకు సమయంతో పాటు ఆర్థిక భారం తప్పుతుందని హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
అధికారులు, వైద్య సిబ్బంది పర్యవేక్షణ
అనంతరం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. ఎమ్మారై సేవల నిర్వహణ నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలని, రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నాణ్యమైన స్కానింగ్ నివేదికలు అందించాలని వైద్యులను ఆదేశించారు.ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్,జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్, ప్రముఖ వైద్యులు డాక్టర్ నరేష్ లు ఎమ్మారై మెషిన్ పనితీరును, దాని ద్వారా రోగులకు చేకూరే లబ్ధిని ఎమ్మెల్యే మరియు కలెక్టర్‌కు వివరించారు.ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బట్టు కర్ణాకర్,ఆసుపత్రి ల్యాబ్ టెక్నీషియన్లు, ఎమ్మారై మిషన్ ఆపరేటర్లు, స్టాఫ్ నర్సులు, కో-ఆర్డినేటర్లు, హాస్పిటల్ నాల్గో తరగతి సిబ్బందితో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు,ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.నూతనంగా ఎమ్మారై మెషిన్ రావడం పట్ల జిల్లా ప్రజలు,రోగుల బంధువులు ప్రభుత్వానికి,స్థానిక ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.