మున్సిపాలిటీలో అక్రమాలపై చర్యలు తీసుకోవాలి
సత్తుపల్లి మున్సిపాలిటీలో ఇటీవల ఏసీబీ సోదాల్లో బయటపడిన అక్రమాలపై బాధ్యులైన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి జాజిరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
మున్సిపాలిటీలో మరిన్ని అక్రమాలు వెలుగులోకి వస్తున్నప్పటికీ, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోకపోవడం వెనుక రాజకీయ నాయకుల పాత్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. 2024 నుంచి 2026 వరకు జరిగిన ఆర్థిక లావాదేవీలు, పన్నుల వసూళ్లపై పై అధికారుల పర్యవేక్షణ ఎక్కడ ఉందని ప్రశ్నించారు.
పట్టణంలోని కొంతమంది వ్యాపారులు, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకుల వద్ద నుంచి వసూలు చేయాల్సిన పన్నులు, బకాయిలను సక్రమంగా వసూలు చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. అదే సమయంలో పేదలు, మధ్యతరగతి ప్రజలపై ఒత్తిడి తెచ్చి బలవంతంగా పన్నులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
పన్నులు చెల్లించలేని పేదల ఇళ్లకు నోటీసులు పంపిస్తూ, ఇళ్లు జప్తు చేస్తామని, నీటి సరఫరా నిలిపివేస్తామని మైక్ ప్రకటనలు చేయడం దుర్మార్గమని అన్నారు. మున్సిపాలిటీ సిబ్బంది నేరుగా ఇళ్లకు వెళ్లి దౌర్జన్యంగా వసూళ్లు చేయడం తీవ్రంగా ఖండించారు.
క్రమబద్ధీకరణ పేరుతో ఇంటి పన్నులు, నీటి పన్నులు అధికంగా విధిస్తూ ప్రజలపై భారాలు మోపుతున్నారని పేర్కొన్నారు. ఇటీవల జారీ చేస్తున్న ఇంటి పన్ను బిల్లులు చూసి సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయని తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి పన్నులు మరింత పెరుగుతాయని వస్తున్న వార్తలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
చెత్త పన్ను, ఇంటి పన్ను, నీటి పన్ను రూపంలో ప్రజలపై ఆర్థిక భారాలు పెంచడం ప్రైవేటీకరణ దిశగా తీసుకుంటున్న చర్యలేనని విమర్శించారు. సత్తుపల్లి మున్సిపాలిటీలో అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని, నష్టాలను రికవరీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ సమస్యపై ప్రభుత్వం స్పందించకపోతే పట్టణ ప్రజలను సమీకరించి ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.