మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతులతో మమేకమై కొనుగోలు విధానంపై వివరాలు వెల్లడించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,మార్క్‌ఫెడ్ ద్వారా రైతులు పండించిన మొక్కజొన్న పంటకు క్వింటాల్‌కు రూ.2400 చొప్పున ధర చెల్లించబడుతుందని తెలిపారు.ఈ ధర రైతులకు లాభదాయకంగా ఉండటంతో,మధ్యవర్తులపై ఆధారపడకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తమ పంటను తీసుకువచ్చి విక్రయించాలని సూచించారు.ఈ అవకాశాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రైతులకు సరైన ధర లభించడంతో పాటు, పారదర్శకంగా కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.అదేవిధంగా కార్యక్రమంలో భూపాలపల్లి ఉద్యానవన శాఖ అధికారి ఎడ్ల సునీల్ కుమార్ మాట్లాడుతూ,రైతులకు అదనపు ఆదాయం పొందేందుకు కూరగాయల సాగును ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.ఈ సందర్భంగా ఐదు రకాల కూరగాయల విత్తనాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా రైతులకు పంపిణీ చేశారు.రైతులు తమ మండలాల్లోనే ఈ విత్తనాలను పొందవచ్చని,ఇందుకోసం పట్టాదారు పాస్‌బుక్ జిరాక్స్, ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోతో సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు.కూరగాయల సాగు ద్వారా రైతులు తక్కువ కాలంలో మంచి లాభాలు పొందవచ్చని వివరించారు.ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, వ్యవసాయ, ఉద్యాన శాఖ సిబ్బంది,పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.ప్రభుత్వ చర్యల ద్వారా రైతులకు మద్దతు లభిస్తూ వ్యవసాయ రంగం బలోపేతం అవుతుందని అధికారులు తెలిపారు.