రేపాక హత్య కేసు ఛేదన–ఇద్దరు నిందితులు అరెస్ట్
రేగొండ మండలంలోని రేపాక గ్రామంలో జరిగిన హత్య కేసును పోలీసులు వేగంగా ఛేదించారు.ఈ ఘటనకు సంబంధించిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.వాహనాల తనిఖీ సమయంలో నిందితులు పట్టుబడటం గమనార్హం.పోలీసుల వివరాల ప్రకారం, రేపాక గ్రామానికి చెందిన కుర్ర చేరాలు (55) అనే వ్యక్తిపై అతని కుమారులు కుర్రే రామ్, లక్ష్మణ్‌లు శనివారం అర్ధరాత్రి సుమారు 1:20 గంటలకు గొడ్డలితో దాడి చేశారు.తీవ్రంగా గాయపడిన చేరాలను ఆసుపత్రికి తరలించగా, ఆదివారం ఉదయం చికిత్స పొందుతూ మరణించాడు.దర్యాప్తులో మృతుడు గ్రామానికి చెందిన ఓ మహిళతో అక్రమ సంబంధం కొనసాగించడం వల్ల కుటుంబంలో విభేదాలు తలెత్తినట్లు, అదే కారణంగా పూర్వ వైరం పెరిగి నిందితులు ముందస్తు ప్రణాళికతో ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.ఘటన అనంతరం పరారైన నిందితులను భూపాలపల్లి సీఐ డి. నరేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి.ఈ క్రమంలో రేగొండ చెక్‌పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు.విచారణలో వారు తమ నేరాన్ని ఒప్పుకున్నారు.నిందితుల వద్ద నుండి హత్యకు ఉపయోగించిన గొడ్డలి, రక్తపు మరకలతో ఉన్న బట్టలు, టూ వీలర్ వాహనం (టీజీ 08 పి 5807), రెండు మొబైల్ ఫోన్లు, అలాగే బాధిత మహిళ నుండి అపహరించిన సుమారు 25 గ్రాముల బంగారు పుస్తెల తాడు స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసును త్వరితగతిన ఛేదించిన భూపాలపల్లి సీఐ డి. నరేష్ కుమార్, ఘనపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సిహెచ్. కరుణాకర్ రావు, రేగొండ ఎస్సై డి. సుధాకర్,పోలీస్ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.