లేబర్ కోడ్ల రద్దుకు సిఐటియు పోరాటం
ఖమ్మంజిల్లా పెనుబల్లి మండల కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ కార్మిక హక్కులను కాలరాస్తోందని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు చలమాల విఠల్రావు తీవ్రంగా విమర్శించారు. కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
సిఐటియు పెనుబల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని వి.ఎం. బంజర్ రింగ్ సెంటర్ వద్ద గురువారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా విఠల్రావు మాట్లాడుతూ, కార్మిక వర్గంపై తీవ్ర ప్రభావం చూపేలా రూపొందించిన ఈ లేబర్ కోడ్లు పూర్తిగా కార్పొరేట్ అనుకూల విధానాలని విమర్శించారు.
దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల పిలుపు మేరకు ఏప్రిల్ 1న “చీకటి రోజు”గా పాటిస్తూ నిరసనలు చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకొని, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించే చర్యలను వెంటనే నిలిపివేయాలని, ప్రభుత్వమే విద్యుత్ సంస్థలను నిర్వహించాలని కోరారు.
ఈ నిరసనలో హమాలి యూనియన్, రిక్షా కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు. గాయం తిరుపతిరావు, తడికమళ్ళ చిరంజీవి, చిట్టిమొదల కృష్ణ, మిట్టపల్లి నాగమణి, తాండ్ర రాజేశ్వరరావు, బాజీ, మిద్దె స్వామి, అన్నపరెడ్డి లక్ష్మయ్య, నాగయ్య, రాములు, చెన్నారావు, బుడ్డియ్య అలియాస్ శ్రీనివాస్, దొంతు మాధవరావు, చందు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.