వంగరలో ఘనంగా ప్రపంచ సైకిల్ దినోత్సవం
ప్రముఖ సైక్లిస్ట్ పిడిశెట్టి రాజుకు సన్మానం
పీవీకి భారతరత్న కోరుతూ వంగర నుండి ఢిల్లీ దాకా రాజు సైకిల్ యాత్ర అభినందనీయం:సర్పంచ్ గజ్జెల సృజన – రమేష్ హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామ పంచాయతీ పరిధిలో ప్రపంచ సైకిల్ దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామానికి చెందిన ప్రముఖ సైక్లిస్ట్ పిడిశెట్టి రాజును వంగర గ్రామ సర్పంచ్ గజ్జెల సృజన – రమేష్ లు శాలువాతో ఘనంగా సత్కరించి,మెమొంటోను అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ గజ్జెల సృజన – రమేష్ లు మాట్లాడుతూ, భారత మాజీ ప్రధాని, స్వర్గీయ పీవీ నరసింహారావు గారికి అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గతంలో పిడిశెట్టి రాజు చేసిన సాహసోపేత సైకిల్ యాత్రను ప్రత్యేకంగా కొనియాడారు.పీవీ స్వగ్రామమైన వంగర నుండి దేశ రాజధాని ఢిల్లీ వరకు రాజు ఒంటరిగా సైకిల్ యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసి,పీవీ మ్యూజియంలో ప్రత్యేక గుర్తింపు పొందడం వంగర గ్రామానికే కాకుండా ఈ ప్రాంతానికే ఎంతో గర్వకారణమని వారు ప్రశంసించారు.అనంతరం సర్పంచ్ సృజన మాట్లాడుతూ,పర్యావరణ పరిరక్షణ, చౌకైన రవాణా సౌకర్యం మరియు మెరుగైన మానవ ఆరోగ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఐక్యరాజ్యసమితి 2018వ సంవత్సరంలో ఈ జూన్ 3వ తేదీని ‘ప్రపంచ సైకిల్ దినోత్సవం’గా అధికారికంగా ప్రకటించిందని గుర్తుచేశారు.ప్రస్తుత యాంత్రిక జీవనంలో ప్రతి ఒక్కరూ నిత్యం సైక్లింగ్‌ను ఒక అలవాటుగా మార్చుకోవాలని, తద్వారా శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవడంతో పాటు కాలుష్య రహిత సమాజ స్థాపనకు, పర్యావరణ సంరక్షణకు తమ వంతు కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.ఈ ఘనమైన కార్యక్రమంలో వంగర గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు,గ్రామ పెద్దలు, యువకులు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని సైక్లింగ్ విశిష్టతను చాటిచెప్పారు.