విద్యా దోపిడీపై సమరశంఖం
చలో ఇందిరా పార్క్”ను విజయవంతం చేయండి-రవి పటేల్ పిలుపు
విద్య హక్కు చట్టం అమలు కోసం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో ధర్నా
సామాన్యుడి బిడ్డకు కార్పొరేట్ చదువు అందే వరకు పోరాటం ఆగదు
రాష్ట్రంలో విద్యా వ్యవస్థను వ్యాపారంగా మార్చి, ప్రైవేట్ విద్యాసంస్థలు సాగిస్తున్న దోపిడీని అరికట్టడమే లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో రేపు (ఆదివారం) హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిర్వహించ తలపెట్టిన “చలో ఇందిరా పార్క్” ధర్నాను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ పిలుపునిచ్చారు. విద్య హక్కు చట్టం–2009 ను రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అధ్యక్షతన జరగనున్న ఈ భారీ నిరసన కార్యక్రమానికి జిల్లా నుండి విద్యార్థుల తల్లిదండ్రులు, మేధావులు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆయన కోరారు.ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ.. నేడు సామాన్యుడి బిడ్డకు కనీసం ఎల్కేజీ సీటు దొరకాలన్నా లక్షలాది రూపాయలు ఫీజుల రూపంలో చెల్లించాల్సి రావడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పుస్తకాలు, యూనిఫామ్లు, బూట్లు, బెల్టుల పేరుతో ప్రైవేట్ యాజమాన్యాలు తల్లిదండ్రుల రక్తాన్ని జుర్రుకుంటున్నాయని మండిపడ్డారు. ఈ భారంతో పేదలు అప్పులపాలై ఆస్తులు అమ్ముకుంటున్నారని,ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ విద్యా మాఫియా ఎప్పుడో అంతమయ్యేదని విమర్శించారు. పాలకుల అండదండలతోనే విద్యా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోందని ధ్వజమెత్తారు.విద్య హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు ఉచితంగా కేటాయించాలని, అది అమలులో ఉంటే సామాన్యుడి బిడ్డ కూడా కార్పొరేట్ పాఠశాలలో ఉచితంగా చదువుకునే అవకాశం ఉండేదని ఆయన గుర్తు చేశారు. చదువు అనేది అమ్ముకునే వస్తువు కాదు, అది ప్రతి బిడ్డ హక్కు అని స్పష్టం చేశారు. ప్రైవేట్ పాఠశాలల ఫీజులపై నియంత్రణ తెచ్చే వరకు, విద్యా వ్యవస్థలో జవాబుదారితనం పెరిగే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. మన బిడ్డల భవిష్యత్తు కోసం, విద్యా హక్కు సాధన కోసం మరో ఉద్యమం చేయాల్సిన సమయం ఆసన్నమైందని, అందుకే రేపు ఉదయం 9 గంటలకు ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నాకు ప్రతి ఒక్కరూ హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.ఈ పిలుపునిచ్చిన వారిలో జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుగాల ప్రణయ్ రాజ్, మడే సంతోష్, వైద్య లక్ష్మణ్, రామ్ చరణ్, రేణుకుంట్ల సునీల్, లక్ష్మణ్ బన్నీ, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.