శ్రీ లక్ష్మీనరసింహస్వామి పునఃప్రతిష్ఠ–బ్రహ్మోత్సవాలకు శ్రీకారం
వాల్ పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండలం కొడవటంచ గ్రామంలో నిర్వహించనున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి పునఃప్రతిష్ఠ మహోత్సవం మరియు బ్రహ్మోత్సవాల (జాతర) నిర్వహణకు సంబంధించి గోడ పత్రిక (వాల్ పోస్టర్)ను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆవిష్కరించారు.కార్యక్రమం భక్తి ఉత్సాహాల మధ్య ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ప్రాంత ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలకు కేంద్రబిందువుగా నిలిచిందని తెలిపారు.పునఃప్రతిష్ఠ మహోత్సవం ద్వారా ఆలయ వైభవం మరింత వెలుగొందుతుందని,బ్రహ్మోత్సవాలు గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పడమే కాకుండా సామాజిక ఐక్యతను బలపరుస్తాయని అన్నారు.పునఃప్రతిష్ఠ కార్యక్రమాల భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో యాగశాల పూజలు, హోమాలు, కలశస్థాపన,మహామంగళహారతి వంటి పూజా విధానాలు నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉత్సవమూర్తుల ప్రత్యేక అలంకరణ, ఊరేగింపులు, హరినామసంకీర్తనలు,అన్నదాన కార్యక్రమాలు,సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు.జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ తరఫున అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని ఎమ్మెల్యే కొనియాడారు.భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించేందుకు ఆలయ కమిటీ, గ్రామస్తులు, దాతలు కలిసికట్టుగా చేస్తున్న కృషి ప్రశంసనీయమని చెప్పారు.ఉత్సవాల విజయవంతానికి ప్రభుత్వ తరఫున అవసరమైన సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.గ్రామంలో విద్యుత్ దీపాల అలంకరణ, శుభ్రత,త్రాగునీరు, రద్దీ నియంత్రణ వంటి అంశాలపై ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులకు సూచించారు.భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు,యువకులు, భక్తులు విస్తృతంగా పాల్గొన్నారు.కార్యక్రమం అనంతరం నిర్వాహకులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.