సింగరేణి కార్మికులది ఈ ప్రభుత్వం సీఎం
ప్రజాపాలన – ప్రగతి బాట బహిరంగ సభలో సీఎం సంచలన వ్యాఖ్యలు ఇందిరమ్మ ఇళ్లతో పేదల ఆత్మగౌరవం – గోదావరి పరిహార ప్రాంతాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం
గణపురం మండలం చెల్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహించిన ప్రజాపాలన – ప్రగతి బాట బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పాల్గొని విస్తృతంగా ప్రసంగించారు.ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా చరిత్ర నుంచి తెలంగాణ ఉద్యమం, సింగరేణి కార్మికుల పోరాటాలు, జిల్లాల విషయంలో జరుగుతున్న తప్పుడు ప్రచారం, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, గత పాలకుల వైఫల్యాలపై సీఎం తీవ్ర స్థాయిలో స్పందించారు.ఉమ్మడి వరంగల్ జిల్లాకు దేశ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.ప్రపంచంలోనే భారతదేశానికి గొప్ప పేరు తీసుకొచ్చిన మాజీ ప్రధాని శ్రీ పీవీ నరసింహారావు ఈ ప్రాంతానికి చెందిన బిడ్డ కావడం ప్రతి తెలంగాణవాసికి గర్వకారణమన్నారు.తొలి తెలంగాణ ఉద్యమం నుంచి మలితెలంగాణ ఉద్యమం వరకు కాకతీయ, ఉస్మానియా విశ్వవిద్యాలయాల విద్యార్థులు ముందుండి పోరాడారని,ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమంలో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు కర్తగా, క్రియగా వ్యవహరించారని సీఎం కొనియాడారు.తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందుభాగంలో నిలిచిన ప్రొఫెసర్ జయశంకర్ కూడా ఈ ప్రాంతానికి చెందినవారేనని గుర్తు చేశారు.ఆయన ఆశయాలను నెరవేర్చడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.నల్లబంగారాన్ని వెలికితీస్తూ దేశ అభివృద్ధికి తోడ్పడుతున్న సింగరేణి కార్మికులు దేశానికే ఆదర్శంగా నిలిచారని, తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది సింగరేణి కార్మికులు పిడికిలి బిగించి ఉద్యమంలో పాల్గొన్నారని సీఎం గుర్తుచేశారు.ఎన్టీఆర్ హయాంలో భూపాలపల్లిని మండల కేంద్రంగా మార్చి బొగ్గు వెలికితీతకు పునాదిరాయి వేసిన విషయాన్ని సీఎం ప్రస్తావించారు.అయితే ప్రస్తుతం భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తారంటూ కొందరు తప్పుడు,విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.రాష్ట్రంలో ఏ జిల్లాను రద్దు చేయడం గానీ, కొత్త జిల్లాను ఏర్పాటు చేయడం గానీ ప్రభుత్వ పరిశీలనలో లేదని స్పష్టం చేశారు. జిల్లా పునర్విభజనపై అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకొని, అసెంబ్లీలో చర్చించిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కుట్రలు, కుతంత్రాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే వారిని అప్రమత్తంగా చూడాలని, భూపాలపల్లి జిల్లా ఎక్కడికీ పోదని తేల్చిచెప్పారు.సింగరేణి కార్మికుల విషయంలో ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. సింగరేణి కార్మికులకు సంబంధించిన మెడికల్ అన్ఫిట్ బోర్డును రద్దు చేస్తామని ప్రకటించారు. సింగరేణి వారసత్వ ఉద్యోగాలపై జరుగుతున్న విష ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. మెడికల్ బోర్డు పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్నవారిని ప్రజలు గమనించాలని అన్నారు. సింగరేణి కార్మికులకు న్యాయం చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, కార్మికులు నిండు మనసుతో పనిచేసినందువల్లే రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. ఈ ప్రభుత్వం సింగరేణి కార్మికులదేనని, వారికి నష్టం కలిగించే ఏ పని చేయబోమని స్పష్టం చేశారు.217 మంది డిస్మిస్ కార్మికుల సమస్యను తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించారని గుర్తు చేస్తూ, గత పాలకులు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని మాయ మాటలు చెప్పారని విమర్శించారు. వెయ్యి ఎకరాల్లో ఎర్రవల్లిలో, వంద ఎకరాల్లో జన్వాడలో ఫామ్ హౌస్లు నిర్మించారని, ఒక కుటుంబానికి టీవీలు, పేపర్లు, వేల కోట్ల రూపాయల వ్యాపారాలు వచ్చాయని ఆరోపించారు.అయితే పేదలకు మాత్రం ఇళ్లు రాలేదన్నారు. ఏడాదికి రెండు లక్షల ఇళ్లు కట్టినా పదేళ్లలో 20 లక్షల ఇళ్లు నిర్మించే అవకాశం ఉన్నా, పేదల ఆత్మగౌరవాన్ని పట్టించుకోలేదని తీవ్ర విమర్శలు గుప్పించారు.భూపాలపల్లిలో రైతు పోరాట బాట, కార్మికుల పోరాట బాటను తానే గతంలో నిర్వహించానని సీఎం గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామని, మొత్తం రూ.22,500 కోట్లతో 4.5 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. వచ్చే బడ్జెట్లో ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతను మంజూరు చేస్తామని ప్రకటించారు. పేదల ఆత్మగౌరవం పెరిగేలా, ఆడబిడ్డలు ఆశీర్వదించేలా ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు.సరస్వతి పుష్కరాలను ఘనంగా నిర్వహించామని, 1000 ఏళ్లు గుర్తుండేలా మేడారం ఆలయాన్ని అభివృద్ధి చేశామని, సమ్మక్క–సారలమ్మ జాతరను ప్రపంచస్థాయిలో నిర్వహించామని సీఎం పేర్కొన్నారు. జంపన్న వాగు నుంచి రామప్ప చెరువుకు నీళ్లు అందించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాల సందర్భంగా బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరిహార ప్రాంతాన్ని రూ.3 నుంచి 4 వేల కోట్లతో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.పదేళ్లు సీఎంగా ఉన్న వారు భూపాలపల్లికి బైపాస్ రోడ్డు కూడా తీసుకురాలేదని విమర్శించారు. మాయ మాటలు చెప్పేవారిని నమ్మితే ప్రజలు మోసపోతారని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు రూ.17,442 కోట్లు మంజూరు చేశామని, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మున్సిపాలిటీలకు రూ.6,116 కోట్లు ఇచ్చామని తెలిపారు. భూపాలపల్లి మున్సిపాలిటీకి రూ.92 కోట్ల నిధులు మంజూరు చేసినట్టు సీఎం వెల్లడించారు.ఇందిరమ్మ చీరలతో మహిళలు దసరా పండుగ రోజు పాలపిట్టల్లా కనిపిస్తున్నారని పేర్కొన్నారు. ఇందిరమ్మ చీరను సారె రూపంలో అందించామని, ప్రతి ఏడాది ఈ పథకాన్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.అనంతరం మహిళా సంఘాలకు రూ.205 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను అందజేశారు.ప్రజా ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదం కొనసాగితేనే సమస్యలన్నింటినీ పరిష్కరించగలమని సీఎం తెలిపారు.ఈ బహిరంగ సభలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రెవెన్యూ, సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పార్లమెంట్ సభ్యులు డా. కడియం కావ్య, ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డి, 20 సూత్రాల అమలు చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, సింగరేణి కార్మిక సంఘం చైర్మన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్లు రాజబాబు, రెహ్మాన్ తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు