ఏళ్ల తరబడి కొనసాగుతున్న సమస్య, పట్టించుకోని అధికారులు
–ఏళ్ల తరబడి కొనసాగుతున్న సమస్య, పట్టించుకోని అధికారులు
తెలుగు గళం న్యూస్ హన్మకొండ జూన్ 09
హన్మకొండ బస్టాండ్లో ప్రయాణికుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి.రెండో అంతస్తు నుంచి వస్తున్న నీరు డ్రైనేజీలోకి వెళ్లకుండా బస్టాండ్ ప్రాంగణంలోనే నిలిచిపోవడంతో భారీ బురద మడుగు ఏర్పడింది.ఫలితంగా ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు.బస్సులు నేరుగా బురద నీటిలోనే ఆగుతుండటంతో ప్రయాణికులు బురదలో నడుచుకుంటూ బస్సులు ఎక్కాల్సిన దుస్థితి నెలకొంది. వృద్ధులు, మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బురదలో జారి పడే ప్రమాదం ఉన్నప్పటికీ అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ సమస్య కొత్తది కాదు. గత కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు శాశ్వత పరిష్కారం చూపడంలో పూర్తిగా విఫలమయ్యారు.వర్షాకాలం వచ్చిందంటే చాలు బస్టాండ్ బురద మయంగా మారడం, ప్రయాణికులు అవస్థలు పడడం పరిపాటిగా మారింది.ప్రతిరోజూ వేలాది మంది రాకపోకలు సాగించే ప్రధాన బస్టాండ్లో ఇంత దారుణ పరిస్థితి నెలకొన్నా సమస్య పరిష్కారానికి చర్యలు లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చే బస్టాండ్లో కనీస డ్రైనేజీ సమస్యను కూడా పరిష్కరించలేకపోవడంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రమాదాలు జరిగే వరకు వేచి చూడకుండా అధికారులు వెంటనే స్పందించి బురద మడుగును తొలగించి, డ్రైనేజీ వ్యవస్థను శాశ్వతంగా సరిచేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.