1/70 చట్టాన్ని బలహీనపరిస్తే ఆదివాసుల ఆగ్రహ జ్వాలలు తప్పవు
- 3 జీవో ను వెంటనే పునరుద్ధరించాలి – రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు తుడుందెబ్బ పోరాట శంఖారావం..!
- ఆగస్టు 9న నల్ల దుస్తులతో రాష్ట్రవ్యాప్త నిరసనలు – ఆగస్టు 17న ఎమ్మార్వోలు, ఎమ్మెల్యేలకు మెమోరాండాలు
- ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు చంద మహేష్ అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి జాతీయ ప్రధాన కార్యదర్శి రమణాల లక్ష్మయ్య, జాతీయ ఉపాధ్యక్షులు పొడెం రత్నం, యాసం రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కబ్బాక శ్రావణ్, రాష్ట్ర కార్యదర్శులు వట్టం జనార్ధన్, చింత కృష్ణ ముఖ్య అతిథులుగా హాజరై ఆదివాసీల భూహక్కులు, రాజ్యాంగ హక్కులు, షెడ్యూల్డ్ ఏరియా రక్షణపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీల భూములు, అటవీ హక్కులు, రాజ్యాంగబద్ధమైన రక్షణలను కాపాడే 1/70 చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్రలు జరుగుతున్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 1/70 చట్టంపై ఎలాంటి దాడి జరిగినా తుడుందెబ్బ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలతో ప్రభుత్వాన్ని నిలదీస్తుందని హెచ్చరించారు. అదేవిధంగా, ఆదివాసీల హక్కుల పరిరక్షణకు కీలకమైన 3 జీవోలను ప్రభుత్వం తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఐదో షెడ్యూల్ ప్రాంతాల్లో రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయడం సహించబోమని, ఆదివాసీల భూములు, అడవులు, సహజ వనరులను కాపాడేందుకు తుడుందెబ్బ ఉద్యమం మరింత ఉధృతం కానుందని స్పష్టం చేశారు.
- సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు
- ఆగస్టు 6న తుడుందెబ్బ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి గ్రామం, ప్రతి మండలంలో తుడుందెబ్బ జెండా ఆవిష్కరణతో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు.
- ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ చట్టాలను ఉల్లంఘిస్తున్న ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలు, నల్ల టోపీలు, నల్ల టీ-షర్టులు ధరించి భారీ నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని తీర్మానించారు.
- ఆగస్టు 17న ప్రతి మండల ఎమ్మార్వో కార్యాలయాల్లో, ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేలకు ఆదివాసీ గిరిజన సమస్యలు, 1/70 చట్ట పరిరక్షణ, 3 జీవోల పునరుద్ధరణ, భూహక్కుల అమలు, అటవీ హక్కుల రక్షణ తదితర అంశాలపై సమగ్ర మెమోరాండాలు సమర్పించాలని నిర్ణయించారు.
- నాయకులు మాట్లాడుతూ, ఆదివాసీ హక్కులను కాలరాసే ప్రభుత్వాలకు తుడుందెబ్బ ఉద్యమమే సమాధానం ఇస్తుందని, రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాపాడే వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు, చలో కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వట్టం సురేష్, మాజీ ప్రధాన కార్యదర్శి కాపుల సమ్మయ్య, ఉపాధ్యక్షులు సిద్దబోయిన సర్వేశ్వరావు, కుచ్చింటి చిరంజీవి, లాయర్ చింత సమ్మయ్య, చింత సోమరాజు, వాసం శ్రావణ్, కోట సంపత్, పొడెం నర్సింగరావు, విజయ్, బిక్షపతి, ఏటూరునాగారం మండల అధ్యక్షులు తాటి నీలాద్రి, గోవిందరావుపేట మండల అధ్యక్షుడు గొంది కిరణ్, తాడ్వాయి మండల అధ్యక్షుడు చంద నవీన్, ఆలం రాంబాబు, వెంకటాపురం మండల అధ్యక్షుడు కనితి వెంకటకృష్ణతో పాటు జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.