ప్రేమ వ్యవహారంలో వేధింపులు–మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యప్రేమ వ్యవహారంలో వేధింపులు–మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

ప్రేమ వ్యవహారంలో ఇద్దరు యువకుల నుంచి ఎదురైన మానసిక వేధింపులను తట్టుకోలేక మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది.వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఏఆర్ (ఆర్మ్డ్ రిజర్వ్) విభాగంలో విధులు నిర్వహిస్తున్న వరంగల్ జిల్లా పర్వతగురి మండలం సీత్య తండాకు చెందిన అనిత (మహిళా కానిస్టేబుల్) ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయింది.పోలీసుల వివరాల ప్రకారం,మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కొమ్మనపల్లి తండాకు చెందిన రాజేందర్ అనితకు దూరపు బంధువుగా ఉంటాడు.గత నాలుగేళ్లుగా ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పుతూ, నిరంతరం ఫోన్‌లు చేయడం, డ్యూటీలో ఉన్న సమయంలోనూ వీడియో కాల్ చేయాలని ఒత్తిడి చేయడం,ఇతరులతో మాట్లాడవద్దంటూ అనుమానంతో వేధింపులకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది.రాజేందర్ ప్రవర్తన నచ్చక అనిత తల్లిదండ్రులు అతనితో వివాహానికి నిరాకరించారు.ఈ నేపథ్యంలో అనిత తన స్నేహితుడు జబ్బార్ లాల్‌తో సన్నిహితంగా ఉంటుందని, అతడిని పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్లు రాజేందర్ గుర్తించాడు.దీంతో జబ్బార్ లాల్‌కు అనితపై తప్పుడు సమాచారాన్ని అందించినట్లు పోలీసులు తెలిపారు.రాజేందర్ చెప్పిన మాటల ప్రభావంతో జబ్బార్ లాల్ అనితను వేధించడం ప్రారంభించాడని ఆరోపణలు ఉన్నాయి.డబ్బులు ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని బెదిరింపులకు దిగడంతో, అనిత తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు తెలిసింది.ఈ పరిస్థితుల్లో అనిత రాజేందర్‌కు ఫోన్ చేసి, “మీ ఇద్దరి వల్ల నా జీవితం నాశనం అయింది, చావే దిక్కుగా మారింది” అంటూ ఆవేదన వ్యక్తం చేసినా, అతడు నిర్లక్ష్యంగా “చస్తే చావు” అంటూ స్పందించినట్లు పోలీసులు తెలిపారు.ఈ మాటలతో పూర్తిగా కుంగిపోయిన అనిత గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.అనిత మృతికి కారణమైన మానసిక వేధింపులపై రాజేందర్, జబ్బార్ లాల్ ఇద్దరిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.ఈ ఘటన పోలీస్ శాఖలోనే కాకుండా స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. మహిళలపై మానసిక వేధింపులు ఎంత ప్రమాదకరమైన పరిణామాలకు దారి తీస్తాయో ఈ ఘటన మరోసారి స్పష్టంచేసిందని అధికారులు పేర్కొన్నారు.మానసిక ఒత్తిడి లేదా వేధింపులతో బాధపడుతున్న వారు ఒంటరిగా భావించకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా నిపుణుల సహాయం తీసుకోవాలి అవసరమైతే సమీప పోలీస్ స్టేషన్ లేదా కౌన్సెలింగ్ కేంద్రాలను సంప్రదించాలి అని అధికారులు పేర్కొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *