రజక కుటుంబంపై దాడిరజక కుటుంబంపై దాడి

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం, కోహెడ మండలంలో రజక కులానికి చెందిన కుటుంబంపై జరిగిన దారుణ దాడి ఘటనను ఖండిస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.ఈ దీక్షను సంఘం జిల్లా అధ్యక్షుడు, కంటెస్టెడ్ ఎమ్మెల్సీ పిడిశెట్టి రాజు నాయకత్వంలో నిర్వహించారు.గత వారం నాగర్ కర్నూల్ జిల్లాలోని కొమ్మెర మల్లికార్జున స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాల సందర్భంగా రజక కులానికి చెందిన చంద్రకళ కుటుంబంపై జరిగిన దాడిలో రెండు నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దారి తీసిందని దీక్షకర్తలు పేర్కొన్నారు. సంఘటనకు బాధ్యులైన నిందితులను ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ఆదేశాల మేరకు ఈ నిరాహార దీక్ష చేపట్టినట్లు పిడిశెట్టి రాజు తెలిపారు.దేవాలయ దర్శనం అనంతరం బయటకు వెళ్తున్న చంద్రకళ కుటుంబాన్ని నిర్వాహకులు అడ్డుకోవడంతో వివాదం చెలరేగి,దుర్భాషలాడుతూ దాడికి పాల్పడినట్లు ఆరోపించారు. ఈ ఘటనలో చిన్నారిని క్రూరంగా హింసించి ప్రాణాలు తీసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారిని సామాజికంగా బహిష్కరించాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా కేసు నమోదు విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని,ముఖ్యంగా సంబంధిత సీఐపై శాఖాపరమైన విచారణ జరిపి బాధ్యత వహింపజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున తక్షణ సహాయం అందించాలని, కనీసం రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమం మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్లకు వినతి పత్రం పంపినట్లు తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.ఈ నిరసన కార్యక్రమంలో చాకలి (రజక) సంక్షేమ సంఘం సీనియర్ నాయకులు బస్వారాజు శంకర్, జాలిగాం శంకర్, ఉప్పరపల్లి రాజయ్య, తిరుపతి, మహిళా సంఘం ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు మరియు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. సంఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి నిందితులను చట్టం ముందు నిలబెట్టాలని డిమాండ్ చేస్తూ దీక్ష కొనసాగుతోంది.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *