• మాటూరి ఏడుకొండలుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలి
  • ఆదివాసుల ఆత్మగౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలి
  • వాట్సాప్‌ గ్రూపులో 1/70 చట్టంపై అసభ్యకర వ్యాఖ్యలు.. పోలీసులకు ఫిర్యాదు
  • గిరిజన హక్కులు, చట్టాలను అవహేళన చేసే వారిని ఉపేక్షించొద్దు – మంగపేట ఆదివాసీ సంఘాలు డిమాండ్

ఈ69న్యూస్ – తెలుగు గళం మంగపేట, సెప్టెంబర్‌ 11:

ములుగు జిల్లా మంగపేట మండలం రమణక్కపేట గ్రామానికి చెందిన మాటూరి ఏడుకొండలు గిరిజనులను, ఆదివాసీ హక్కులను, గిరిజన రక్షణ చట్టాలను అవమానిస్తూ, హేళన చేస్తూ సోషల్‌ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేశారని మంగపేట మండల ఆదివాసీ ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై తక్షణమే విచారణ జరిపి, బాధ్యుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సెప్టెంబర్‌ 9వ తేదీ రాత్రి 11:49 గంటల సమయంలో “స్వాగతం రమణక్కపేట” అనే వాట్సాప్‌ గ్రూపులో ఆదివాసీ గిరిజనులను ఉద్దేశించి, గిరిజన రక్షణకు సంబంధించిన 1/70 చట్టాన్ని కించపరిచేలా అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగిస్తూ వ్యాఖ్యలు చేశారని నాయకులు పేర్కొన్నారు. గిరిజనుల భూములు, హక్కులు, రక్షణ కోసం రాజ్యాంగబద్ధంగా అమలులో ఉన్న చట్టాలను అవహేళన చేయడం ద్వారా ఆదివాసీ సమాజం ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 1/70 చట్టం, పీసా చట్టం, ఐదవ షెడ్యూల్‌ వంటి గిరిజన రక్షణ చట్టాలు ఆదివాసుల హక్కులు, భూములు, స్వయం పరిపాలనను పరిరక్షించేందుకు ఏర్పడిన రాజ్యాంగబద్ధమైన రక్షణలు అని ఆదివాసీ సంఘాల నాయకులు తెలిపారు. అలాంటి చట్టాలను కించపరిచే విధంగా సోషల్‌ మీడియాలో వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమని, ఇలాంటి వ్యాఖ్యలు గిరిజన సమాజంలో తీవ్ర ఆవేదనకు దారితీస్తున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో మంగపేట పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సైని కలిసి మాటూరి ఏడుకొండలుపై ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీస్‌ నిరోధక) చట్టం–1989తో పాటు వర్తించే ఇతర చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి, సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ పిటిషన్‌ అందజేశారు. సోషల్‌ మీడియా గ్రూపులో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆధారాలను పరిశీలించి, వాస్తవాలు నిర్ధారించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. గిరిజనుల ఆత్మగౌరవాన్ని, రాజ్యాంగం కల్పించిన హక్కులను కించపరిచే వ్యాఖ్యలు ఎక్కడ జరిగినా ఆదివాసీ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తాయని నాయకులు స్పష్టం చేశారు. సోషల్‌ మీడియాను వేదికగా చేసుకుని గిరిజనులను అవమానించడం, గిరిజన రక్షణ చట్టాలను హేళన చేయడం పునరావృతం కాకుండా పోలీసు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు నల్లెబోయిన లక్ష్మణ్‌ దొర, జిల్లా సోషల్‌ మీడియా ఇన్‌చార్జి ఎట్టి సారయ్య దొర, తుడుం దెబ్బ ములుగు డివిజన్‌ ప్రధాన కార్యదర్శి పొదెం నాగేష్‌, మన్యసీమ పరిరక్షణ సమితి డోలు దెబ్బ మంగపేట మండల అధ్యక్షుడు తాటి నాగరాజు, మన్యసీమ జిల్లా నాయకులు తోలేం సుధాకర్‌, ఆక తిరుమలరావు, విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కబ్బాక లక్ష్మణ్‌, తుడుం దెబ్బ జిల్లా కార్యదర్శి కుర్సం రమేష్‌, పేసా జిల్లా అధ్యక్షులు డబ్బుల ముత్యాలరావు, పేసా మంగపేట మండల అధ్యక్షుడు జోగ నరేందర్‌, తుడుం దెబ్బ మంగపేట మండల అధ్యక్షుడు పూనెం ప్రశాంత్‌, తదితర నాయకులు పాల్గొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *