
ఈ69న్యూస్ ధర్మసాగర్, సెప్టెంబర్ 11
ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామంలో రాత్రివేళ గుర్తుతెలియని మృగం దాడిలో దూడ మృతి చెందిన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన పశువుల యజమాని రాజారపు సదానందం తెలిపిన వివరాల ప్రకారం.. రోజువారీగా పాలు పితికేందుకు శుక్రవారం ఉదయం సుమారు 5 గంటలకు బావి వద్దకు వెళ్లి చూడగా దూడ మృతిచెంది ఉండటాన్ని గుర్తించారు. దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.రాత్రివేళ గుర్తుతెలియని మృగం దాడి చేయడం వల్లే దూడ మృతి చెంది ఉండవచ్చని యజమాని అనుమానం వ్యక్తం చేశారు. కాగా, కొన్ని రోజుల క్రితం కూడా ఇదే తరహాలో ఆవు, దూడ మృతి చెందినట్లు సదానంద తెలిపారు. వరుసగా పశువులు మృతి చెందుతుండటంతో గ్రామ పరిసరాల్లో గుర్తుతెలియని మృగం సంచరిస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.రాత్రివేళ పశువులను బయట కట్టివేయాల్సి వస్తుండటంతో యజమానులు ఆందోళన చెందుతున్నారు. గ్రామ శివారు ప్రాంతాల్లో సంచరిస్తున్న జంతువు ఏదో గుర్తించి, పశువులపై మరిన్ని దాడులు జరగకుండా సంబంధిత అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.