
పీఎస్‌లోనే ఫైటింగ్
కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఇరువర్గాల ఘర్షణ
ఈ69 న్యూస్ కొత్తగూడెం, సెప్టెంబర్ 25
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో వివాహేతర సంబంధం వ్యవహారంపై తలెత్తిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకుంటూ ఏకంగా పోలీస్‌స్టేషన్‌లోకి దూసుకెళ్లడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపుతప్పింది.కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లోనే ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగడంతో అక్కడ కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.వివాహేతర సంబంధానికి సంబంధించిన విషయంపై ఇరువర్గాల మధ్య తొలుత మాటల యుద్ధం ప్రారంభమైనట్లు సమాచారం.మాటామాటా పెరగడంతో ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. అనంతరం పరస్పరం దాడులు చేసుకుంటూనే ఇరువర్గాలు పోలీస్‌స్టేషన్ వైపు వెళ్లినట్లు తెలిసింది.స్టేషన్ ప్రాంగణంలోకి చేరుకున్న తర్వాత కూడా ఇరువర్గాలు వెనక్కి తగ్గకుండా ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.వినాయక నిమజ్జనం బందోబస్తు విధుల్లో త్రీ టౌన్ పోలీసులు నిమగ్నమై ఉండటంతో స్టేషన్‌లో సిబ్బంది తక్కువగా ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. పదుల సంఖ్యలో ఇరువర్గాలకు చెందిన వ్యక్తులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.అయితే నైట్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుళ్లు వెంటనే అప్రమత్తమై ఇరువర్గాలను చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి ఘర్షణకు పాల్పడిన కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను సేకరిస్తూ పోలీసులు విచారణ చేపట్టారు. ఘర్షణకు దారితీసిన కారణాలు, ఇరువర్గాల మధ్య ఉన్న వివాదంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.