నంబర్ ప్లేట్ లేని టాటా ట్రాలీలో అమానుషంగా తరలింపు.. మరిపెడ పోలీసుల తనిఖీల్లో వెలుగులోకి అక్రమ దందా
ముగ్గురిపై కేసు నమోదు.. వాహనం సీజ్ చేసి పశువులకు వైద్య చికిత్స
తెలుగు గళం e69న్యూస్ | మహబూబాబాద్ జిల్లా nov 03

కొబ్బరి బొండాల మాటున పశువులను దాచిపెట్టి అక్రమంగా తరలిస్తున్న వ్యవహారం మరిపెడ పోలీసుల తనిఖీల్లో వెలుగుచూసింది. నంబర్ ప్లేట్ లేకుండా కొబ్బరి బొండాలతో వెళ్తున్న అనుమానాస్పద టాటా ట్రాలీని రాత్రి పెట్రోలింగ్‌లో పోలీసులు ఆపి తనిఖీ చేయగా, అందులో కాళ్లు, మెడలకు తాళ్లతో కట్టివేసిన స్థితిలో 6 ఆవులు, 2 కోడెగిత్తలు కలిపి మొత్తం 8 పశువులను గుర్తించారు.
మరిపెడ పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుళ్లు నరేష్, జి. శ్రీను రాత్రి గస్తీ నిర్వహిస్తున్న సమయంలో ఈ అక్రమ రవాణాను గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లికి చెందిన గొర్ల శివ, యలమచిలీ శివ, బంగారి లచ్చన్న పశువులను అనకాపల్లి ప్రాంతం నుంచి సేకరించి, కొబ్బరి బొండాల మాటున హైదరాబాద్‌లోని కబేళాలకు తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
పోలీసులు పశువులను రక్షించి సురక్షిత ప్రాంతానికి తరలించడంతో పాటు పశువైద్యులతో వైద్య చికిత్స అందించారు. గాయపడిన పశువులు ప్రస్తుతం కోలుకుంటున్నట్లు తెలిపారు.
ట్రాలీ సీజ్.. ముగ్గురిపై కేసు
పశువుల అక్రమ రవాణాకు ఉపయోగించిన టాటా ట్రాలీని పోలీసులు సీజ్ చేశారు. ముగ్గురు నిందితులపై పశువుల అక్రమ రవాణా, జంతువుల పట్ల క్రూరత్వానికి సంబంధించిన చట్టాల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పశువుల అక్రమ రవాణా, మూగజీవాల పట్ల క్రూరత్వానికి పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మరిపెడ ఎస్ఐ సతీష్ హెచ్చరించారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలు ఎక్కడైనా గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.