
జనగామ సెప్టెంబర్ 27 (ఈ69న్యూస్)
మహమ్మద్ ప్రవక్త హజ్రత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన మానవతా విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో లింగాలఘనపూర్ మండలం కుందారం గ్రామంలో సీరతున్నబీ–ప్రజ్ఞే గౌసుల్ అల్వారా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
కుందారం గ్రామ మసీదు కమిటీ అధ్యక్షుడు ఎండీ ఖలీల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి ముస్లిం మత గురువులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త బోధనలు, ఆదేశాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు.
ఆడపిల్లలకు స్వేచ్ఛ, సమానత్వం, గౌరవం కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కుల, మత, తరతమ్య భేదాలకు అతీతంగా సమాజంలోని ప్రతి ఒక్కరినీ గౌరవించాలని పిలుపునిచ్చారు. ఇరుగు పొరుగు వారితో స్నేహభావంతో మెలుగుతూ పరస్పర సహకారం, సోదరభావాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.
మానవత్వం, ప్రేమ, శాంతి, సోదరభావం వంటి విలువలను సమాజంలో మరింత బలోపేతం చేయాలని వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ మహ్మద్ అజీజ్ సురవర్తి, మౌలానా షేక్ యూనుస్ ఖాద్రి తదితరులు ప్రసంగించి ప్రవక్త బోధనలు, సమాజం పట్ల ప్రతి ఒక్కరి బాధ్యతలను వివరించారు.
ముఖ్య అతిథిగా జనాబ్ మహ్మద్ సమీఉల్లా ఖాద్రి పాల్గొన్నారు. కార్యక్రమంలో జమాల్ హరీప్, ముషీందు రాజ, సాదిక్, మెహరాజ్, గులాం హుస్సేన్ తదితరులతో పాటు వివిధ గ్రామాలకు చెందిన ముస్లిం మత గురువులు, ప్రజలు పాల్గొన్నారు.
కార్యక్రమం అనంతరం నిర్వాహకుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో జరిగిన సీరతున్నబీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు అనంతరం అన్నదానంలో పాల్గొన్నారు.