నాలుగు శాఖల పరిధిలోని రికార్డులపై సమగ్ర సమాచారం కోరిన సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ

స్టేషన్‌ఘన్‌పూర్,అక్టోబరు 7,(ఈ69న్యూస్)
ఇప్పుగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని ఇంటి నెంబర్ 4-15 ఇంటి నంబర్‌కు సంబంధించిన వ్యవహారంపై సమగ్ర వివరాలు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమాచార హక్కు చట్టం–2005 కింద ఆర్టీఐ దరఖాస్తు సమర్పించినట్లు సమాచార హక్కు పరిరక్షణ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఇంటి నంబర్లో జరిగిన మార్పులు,పంచాయతీ రికార్డుల్లో నమోదైన వివరాలు,సంబంధిత ఫిర్యాదులు, గ్రీవెన్స్‌లు, పంచాయతీ కార్యదర్శి బదిలీ,పోలీస్‌స్టేషన్‌కు అందిన ఫిర్యాదులు,ఫోర్జరీ సంతకాలుగా పేర్కొన్న ఆరోపణలు,ఎంపీడీవో కార్యాలయం తీసుకున్న చర్యలు తదితర అంశాలపై అధికారిక రికార్డుల ద్వారా వాస్తవాలను తెలుసుకునేందుకే ఈ సమాచారాన్ని కోరినట్లు పేర్కొన్నారు.ఈ వ్యవహారానికి సంబంధించిన సమాచారం ఒక్క ప్రభుత్వ కార్యాలయానికి మాత్రమే పరిమితం కాకుండా పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ,జిల్లా కలెక్టర్ కార్యాలయం,పోలీస్ కమిషనర్ కార్యాలయం,ఎంపీడీవో కార్యాలయాల పరిధిలో ఉండే అవకాశం ఉన్నందున అన్ని శాఖల నుంచి సమగ్ర సమాచారాన్ని సేకరించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని కోరినట్లు తెలిపారు.

ఇంటి నంబర్ మార్పులపై పూర్తి వివరాలు
ఇంటి నెంబర్ 4-15కు సంబంధించి తొలుత ఇంటి నంబర్ ఎలా కేటాయించారు?,అనంతరం ఏమైనా మార్పులు జరిగితే వాటికి కారణాలేమిటి?,మార్పు కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకున్నారా?,దానికి సంబంధించి పంచాయతీ అధికారులు ఎలాంటి విచారణ చేపట్టారు?,ఎవరి అనుమతితో ఇంటి నంబర్లో మార్పులు చేశారు?,వంటి వివరాలను అధికారిక రికార్డుల ద్వారా వెల్లడించాలని కోరినట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు.అదేవిధంగా హౌస్ రిజిస్టర్,అసెస్మెంట్ రిజిస్టర్,ఇంటి పన్ను రికార్డులు,పన్ను చెల్లింపులకు సంబంధించిన వివరాలు, ఇంటి నంబర్ కేటాయింపు లేదా మార్పులకు సంబంధించిన దరఖాస్తులు,అనుమతులు,ఫైల్ నోట్లు,సంబంధిత ఉత్తర్వులు తదితర రికార్డుల ప్రతులను అందించాలని కోరినట్లు తెలిపారు.

పంచాయతీరాజ్ శాఖ నుంచి సమాచారం
ఇంటి నంబర్ వ్యవహారానికి సంబంధించిన పంచాయతీ రికార్డులన్నింటినీ పరిశీలించేందుకు అవకాశం కల్పించాలని,సంబంధిత ఫైల్ ఏ అధికారి వద్ద నుంచి ఏ అధికారి వద్దకు వెళ్లిందో తెలిపే ఫైల్ మూవ్మెంట్ వివరాలు కూడా అందించాలని కోరినట్లు పేర్కొన్నారు.ఇంటి నంబర్ మార్పు విషయంలో పంచాయతీ కార్యదర్శి,ఇతర సిబ్బంది లేదా అధికారులు ఏదైనా నివేదిక రూపొందించి ఉంటే దాని ప్రతులను,దానిపై ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలను కూడా వెల్లడించాలని కోరినట్లు తెలిపారు.
కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదులపై ఆరా
ఇంటి నెంబర్ 4-15 వ్యవహారానికి సంబంధించి గతంలో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఎవరైనా ఫిర్యాదులు,వినతులు లేదా గ్రీవెన్స్‌లు సమర్పించి ఉంటే వాటి వివరాలను అందించాలని కోరినట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు.ఆయా ఫిర్యాదులను ఏ అధికారికి పంపారు?,ఎప్పుడు పంపారు?,సంబంధిత అధికారుల నుంచి నివేదిక కోరారా?,తనిఖీలు నిర్వహించారా?,యాక్షన్ టేకెన్ రిపోర్టులు సమర్పించారా? వంటి వివరాలను అధికారిక రికార్డుల ఆధారంగా వెల్లడించాలని కోరినట్లు చెప్పారు.అలాగే ఈ అంశంపై ఇప్పటివరకు జిల్లా స్థాయిలో ఏమైనా నిర్ణయం తీసుకున్నట్లయితే ఆ ఉత్తర్వులు,నివేదికలు,నోట్‌ఫైళ్ల ప్రతులను అందించాలని కోరినట్లు పేర్కొన్నారు.

పోలీస్‌స్టేషన్‌కు అందిన ఫిర్యాదులపై వివరాలు
ఇంటి నెంబర్ 4-15 వ్యవహారంలో ఫోర్జరీ సంతకాలుగా పేర్కొన్న ఆరోపణలకు సంబంధించి పోలీస్‌స్టేషన్‌కు ఎవరైనా ఫిర్యాదు చేశారా?,ఫిర్యాదు అందితే దానిపై పోలీస్ అధికారులు ఏం చేశారు?,ప్రాథమిక విచారణ జరిగిందా?,కేసు నమోదు చేశారా?,దర్యాప్తు ఏ స్థాయిలో ఉంది? అనే అంశాలకు సంబంధించి చట్టబద్ధంగా వెల్లడించగల సమాచారాన్ని అందించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ కార్యాలయాన్ని కోరినట్లు తెలిపారు.ఫిర్యాదు,విచారణ,కేసు లేదా దర్యాప్తుకు సంబంధించిన రికార్డుల్లో చట్టప్రకారం వెల్లడించగల భాగాల ప్రతులను అందించాలని ఆర్టీఐలో కోరినట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు.
ఎంపీడీవో కార్యాలయంపై ప్రత్యేకంగా ప్రశ్నలు
ఈ వ్యవహారంలో ఎంపీడీవో కార్యాలయానికి ప్రజల నుంచి ఫిర్యాదులు, గ్రీవెన్స్‌లు అందినట్లయితే వాటిపై ఇప్పటివరకు ఏ చర్యలు తీసుకున్నారనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలని కోరినట్లు తెలిపారు.
ఫిర్యాదు అందిన తేదీ, దానిపై అధికారులు తీసుకున్న చర్య,ఎవరికి విచారణ బాధ్యత అప్పగించారు?,ఏ తేదీన తనిఖీ నిర్వహించారు?,సంబంధిత గ్రామపంచాయతీ కార్యదర్శి నుంచి నివేదిక కోరారా?,కోరితే నివేదిక ఎప్పుడు అందింది?,నివేదికలో ఏమి పేర్కొన్నారు?,దానిపై ఉన్నతాధికారులు ఏ నిర్ణయం తీసుకున్నారు? వంటి అంశాలకు సంబంధించిన అధికారిక రికార్డులను అందించాలని కోరినట్లు చెప్పారు.అదేవిధంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ఇంటి నెంబర్ 4-15 వ్యవహారానికి సంబంధించిన వార్తలు వచ్చిన తర్వాత అధికారుల దృష్టికి విషయం వెళ్లిందా?, వెళ్లినట్లయితే దానిపై ఏమైనా చర్యలు తీసుకున్నారా? అనే వివరాలను కూడా కోరినట్లు తెలిపారు.
చర్యలు తీసుకోకపోతే కారణాలేమిటి?
ఫిర్యాదులు, గ్రీవెన్స్‌లు లేదా మీడియా ద్వారా విషయం అధికారుల దృష్టికి వచ్చినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోతే అందుకు కారణాలు ఏమిటి?,ఆ విషయాన్ని ఫైల్లో నమోదు చేశారా?,సంబంధిత అధికారి ఏదైనా నోట్ నమోదు చేశారా?,ఉన్నతాధికారులు ఏదైనా ఆదేశాలు జారీ చేశారా?,అనే అంశాలపై కూడా సమాచారం ఇవ్వాలని కోరినట్లు పేర్కొన్నారు.చర్యలు తీసుకున్నట్లయితే ఆ చర్యలకు సంబంధించిన నోట్‌ఫైల్,ఉత్తర్వులు,తనిఖీ నివేదికలు,సంబంధిత అధికారుల నివేదికలు,యాక్షన్ టేకెన్ రిపోర్టుల ప్రతులను ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.
పంచాయతీ కార్యదర్శి బదిలీపై స్పష్టత కోరుతూ..
ఇంటి నంబర్ వ్యవహారానికి సంబంధించిన ఫిర్యాదులు, వివాదాలు కొనసాగుతున్న సమయంలో సంబంధిత గ్రామపంచాయతీ కార్యదర్శి బదిలీ కావడానికి దారితీసిన పరిపాలనా కారణాలపై కూడా వివరాలు కోరినట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు.
కార్యదర్శి బదిలీకి ముందు ఏదైనా ఫిర్యాదు అందిందా?,ఏదైనా విచారణ జరిగిందా?,విచారణ నివేదిక సమర్పించారా?,కార్యదర్శిపై పరిపాలనా చర్యలకు సంబంధించిన ప్రతిపాదన ఏమైనా ఉందా?,బదిలీ ఉత్తర్వులు ఏ అధికారి జారీ చేశారు?,బదిలీకి అధికారికంగా నమోదు చేసిన కారణం ఏమిటి?,వంటి వివరాలను సంబంధిత రికార్డుల ద్వారా వెల్లడించాలని కోరినట్లు తెలిపారు.బదిలీకి సంబంధించిన ఉత్తర్వులు,ప్రతిపాదనలు,నోట్‌ఫైళ్లు,వర్తించే నిబంధనలు తదితర సమాచారాన్ని అందించాలని ఆర్టీఐ దరఖాస్తులో కోరినట్లు పేర్కొన్నారు.
నాలుగు శాఖల నుంచి సమాచారం సేకరించాలని విజ్ఞప్తి
ఈ వ్యవహారంలో సమాచారం వేర్వేరు శాఖలు,కార్యాలయాల పరిధిలో ఉన్నందున ఒకే కార్యాలయంలో సమాచారం అందుబాటులో లేకపోతే సంబంధిత ప్రజా ప్రాధికార సంస్థకు దరఖాస్తును బదిలీ చేయాలని కమిటీ ప్రతినిధులు కోరారు.
సెక్షన్ 6(3) ప్రకారం బదిలీ చేయాలని విజ్ఞప్తి
ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 6(3) ప్రకారం సంబంధిత ప్రజా సమాచార అధికారికి దరఖాస్తును బదిలీ చేసి,చట్టంలో నిర్దేశించిన గడువులో సమాచారం అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరినట్లు తెలిపారు.
‘రికార్డులే వాస్తవాలను వెల్లడించాలి’
ఈ సందర్భంగా సమాచార హక్కు పరిరక్షణ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ.. “ఇంటి నెంబర్ .4-15 ఇంటి నంబర్ ఎలా మారింది? ఎవరెవరు దానికి అనుమతులు ఇచ్చారు?,పంచాయతీ రికార్డుల్లో ఏ విధంగా నమోదైంది?,కార్యదర్శి బదిలీకి కారణం ఏమిటి?,ఫోర్జరీ సంతకాలుగా పేర్కొన్న ఆరోపణలపై పోలీస్ శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంది?,కలెక్టర్,ఎంపీడీవో కార్యాలయాలకు వచ్చిన ఫిర్యాదులపై ఏం చేశారు?,మీడియా ద్వారా విషయం అధికారుల దృష్టికి వచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్నారు?,అనే అంశాలపై అధికారిక రికార్డులే సమాధానం చెప్పాలి” అని అన్నారు.ఎవరినీ ముందుగానే దోషిగా నిర్ధారించడం తమ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న రికార్డులు, ఫైళ్లు, ఉత్తర్వులు, నివేదికల ఆధారంగా వాస్తవాలను తెలుసుకుని ప్రజల ముందుంచడమే తమ ఉద్దేశమని తెలిపారు.ఏదైనా తప్పిదం జరిగినట్లు అధికారిక రికార్డుల ద్వారా తేలితే సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని, ఎలాంటి తప్పిదం జరగకపోతే అదే విషయాన్ని అధికారిక రికార్డుల ద్వారా ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సమాచార హక్కుచట్టం పరిరక్షణ కమిటీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు కాట కుమారస్వామి, సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ జనగామ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ జావిద్, సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు కేశోజు శ్రీధర్,ఆయా జిల్లాల ప్రధాన కార్యదర్శులు పాల్గొని సంబంధిత ఆర్టీఐ దరఖాస్తులను సమర్పించినట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు.