!మద్యపానానికి వ్యతిరేకంగా ఎమ్మార్పీఎస్ పోరాటం
గ్రామ సర్పంచ్‌కు వినతిపత్రం అందజేత

ధర్మసాగర్, అక్టోబర్ 10(E69NEWS):
ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామంలో బెల్ట్ దుకాణాలను మూసివేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు గ్రామ సర్పంచ్ పుట్ట రేణుకకు వినతిపత్రం అందజేశారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మద్యపానానికి వ్యతిరేకంగా చేపడుతున్న పోరాటంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.గ్రామంలో పలువురు మద్యపానానికి బానిసలవుతున్నారని గ్రామస్తులు ఎమ్మార్పీఎస్ నాయకుల దృష్టికి తీసుకురావడంతో వారు స్పందించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ ధర్మసాగర్ మండల అధ్యక్షుడు సింగారపు పవన్ మాదిగ మాట్లాడుతూ, మద్యపానం కారణంగా అనేక కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం, కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని నారాయణగిరి గ్రామంలో బెల్ట్ దుకాణాలను మూసివేసేందుకు అధికారులు, గ్రామపంచాయతీ పాలకవర్గం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.అనంతరం ఎమ్మార్పీఎస్ నారాయణగిరి గ్రామశాఖ అధ్యక్షుడు వక్కల అక్షిత్ మాదిగ ఆధ్వర్యంలో సర్పంచ్ పుట్ట రేణుకను కలిసి వినతిపత్రం సమర్పించారు. గ్రామ ప్రజలను మద్యపాన వ్యసనం నుంచి కాపాడేందుకు బెల్ట్ దుకాణాల నిర్వహణను అరికట్టాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ధర్మసాగర్ మండల ఉపాధ్యక్షుడు సింగారపు దిలీప్ మాదిగ, మండల ప్రధాన కార్యదర్శి వక్కల రుసన్ మాదిగ, మండల కోశాధికారి నక్క ప్రవీణ్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.