కేర్‌టేకర్ చేతిలో రిటైర్డ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హత్య.. నిందితుడు అరెస్ట్
వరంగల్, అక్టోబర్ 12 (ఈ69న్యూస్)

వరంగల్ నగరంలోని మట్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన వృద్ధుడి హత్య కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. శాంతినగర్‌లోని బ్యాంక్ కాలనీ-IIలో నివాసం ఉంటున్న రిటైర్డ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కోలిపాక వెంకటస్వామి (75)పై దాడి జరగడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ అక్టోబర్ 9న మృతి చెందారు.
కేర్టేకర్ల మధ్య గొడవే కారణం
పోలీసుల వివరాల ప్రకారం.. వెంకటస్వామిని చూసుకోవడానికి కుటుంబ సభ్యులు భీమారంలోని రామ్ కేర్‌టేకర్ సర్వీసెస్ ద్వారా నిట్ట రాంబాబు, శాంత అనే ఇద్దరు కేర్టేకర్లను నియమించారు. సెప్టెంబర్ 1న వారిద్దరి మధ్య గొడవ జరగడంతో వారి సేవలు ఇక అవసరం లేదని తెలిపారు. దీంతో ఆగ్రహానికి గురైన రాంబాబు మద్యం మత్తులో వెంకటస్వామిపై దాడి చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
నిందితుడు వృద్ధుడిని కిందకు తోసి, రాగి కడియంతో తలపై, పక్కటెముకలపై తీవ్రంగా కొట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. అనంతరం రక్తపు మరకలను తుడిచివేసి, రక్తం అంటిన బనియన్‌ను పారవేసినట్లు తెలిపారు. వృద్ధుడు కిందపడి గాయపడ్డాడని సెక్యూరిటీ గార్డు, కుటుంబ సభ్యులకు చెప్పి ఘటనను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించినట్లు వెల్లడించారు.
చికిత్స పొందుతూ మృతి
తీవ్రంగా గాయపడిన వెంకటస్వామిని తొలుత అజారా ఆసుపత్రికి, అనంతరం హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అక్టోబర్ 9న ఉదయం 6:02 గంటలకు మృతి చెందారు.
మృతుడి కుమారుడు కోలిపాక శ్రావణ్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మట్వాడ పోలీసులు సెప్టెంబర్ 8న కేసు నమోదు చేశారు. తొలుత నమోదు చేసిన కేసులో, వృద్ధుడి మృతి అనంతరం భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 103(1), 238లను చేర్చినట్లు వివరాలు వెల్లడిస్తున్నాయి.
ఎంజీఎం ఆసుపత్రి వద్ద అరెస్ట్
కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడు నిట్ట రాంబాబు (46)ను అక్టోబర్ 11న వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించినట్లు భావిస్తున్న రాగి కడియాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం రిమాండ్‌కు తరలించారు.
వృద్ధుడిపై దాడి, అనంతరం సాక్ష్యాలను చెరిపివేసేందుకు చేసిన ప్రయత్నాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.