ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనానికి ఆర్టీఐ చట్టమే ఆయుధం
ఈ69న్యూస్ జనగామ, అక్టోబరు 12

సమాచార హక్కు చట్టం–2005 ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ పాలనను ప్రశ్నించే హక్కును ప్రజలకు కల్పించిన శక్తివంతమైన ఆయుధమని సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ నాయకులు పేర్కొన్నారు. ప్రతి పౌరుడు ఈ చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చిన సందర్భంగా సోమవారం జనగామ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. జాతీయ కమిటీ అధ్యక్షులు జంగిడి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఎ.టి. ఆంజనేయులు, రాష్ట్ర అధ్యక్షులు ఎలిగండ్ల వెంకటేష్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు మహమ్మద్ జావీద్ ఖాన్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా రాష్ట్ర కమిటీ కార్యదర్శి గోపాలదాస్ ఉపేందర్, జనగామ జిల్లా ఇన్‌చార్జి నీలం భాస్కర్ పాల్గొన్నారు. వారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, అనంతరం కేక్ కట్ చేసి సమాచార హక్కు చట్టం ప్రాధాన్యతను వివరించారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకతను పెంపొందించడంతో పాటు అధికారుల జవాబుదారీతనాన్ని నిర్ధారించడంలో ఆర్టీఐ చట్టం కీలక పాత్ర పోషిస్తోందని నాయకులు అన్నారు. ప్రభుత్వ శాఖల పనితీరు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, ప్రజాధనం వినియోగం తదితర అంశాలపై సామాన్య పౌరులు సైతం చట్టబద్ధంగా సమాచారం కోరవచ్చని తెలిపారు.
ప్రభుత్వ నిధుల కేటాయింపులు, ఖర్చులు, అభివృద్ధి పనుల వివరాలు, సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక వంటి అంశాలపై ప్రజలు ప్రశ్నించాలని సూచించారు. గ్రామపంచాయతీ నుంచి జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాల వరకు సంబంధిత ప్రజా సమాచార అధికారులు చట్ట నిబంధనల ప్రకారం సమాచారం అందించాల్సిన బాధ్యత కలిగి ఉంటారని పేర్కొన్నారు. సాధారణంగా ఆర్టీఐ దరఖాస్తులకు 30 రోజుల్లో సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని, సమాచారం నిరాకరించినా లేదా నిర్ణీత గడువులో అందించకపోయినా చట్టప్రకారం అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని వివరించారు.
గ్రామీణ ప్రాంతాల్లో సమాచార హక్కు చట్టంపై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని నాయకులు అభిప్రాయపడ్డారు. అవినీతి, అక్రమాలు, ప్రజాధనం దుర్వినియోగాన్ని వెలికితీయడంలో ఈ చట్టం ఉపయోగపడుతుందని తెలిపారు. సమాచారాన్ని కోరే పౌరులను ఇబ్బందులకు గురిచేయకుండా, చట్టబద్ధంగా దరఖాస్తు చేసుకున్న వారి హక్కులను అధికారులు గౌరవించాలని కోరారు.
సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్రజలకు చట్టంపై అవగాహన కల్పించడంతో పాటు దాని పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తామని నాయకులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ సతీష్, జిల్లా ప్రధాన కార్యదర్శి బైరి భరత్, జిల్లా కార్యదర్శులు నల్ల విక్రమ్, గండి నాగరాజు, పట్టణ అధ్యక్షులు గందమళ్ల కమలాకర్, లింగాల ఘనపూర్ మండల అధ్యక్షులు మేడ ప్రశాంత్, స్టేషన్ ఘనపూర్ అధ్యక్షులు మహమ్మద్ సలీం, రఘునాథపల్లి మండల అధ్యక్షులు కుకుడాల కిరణ్ కుమార్, జేరిపోతుల కుమార్, విద్యావేత్త గుగ్గిళ్ల రవి, నక్క నరేష్, రాష్ట్ర ఉత్తమ రైతు గుగ్గిళ్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.