- ప్రస్తుత కమిటీ ఉండగానే కొత్త కమిటీ ఎందుకు? రాష్ట్ర నాయకత్వం స్పష్టత ఇవ్వాలి,
- తుడుందెబ్బలో కమిటీల వివాదం..
- బైలాకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి!
- -తుడుం దెబ్బ మండల అధ్యక్షుడు తుర్స చంటి దొర డిమాండ్
తెలుగు గళం నూగూర్ వెంకటాపురం, అక్టోబర్ 15:
వెంకటాపురం మండలంలో ఇప్పటికే కొనసాగుతున్న ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) మండల కమిటీ ఉండగానే మరో నూతన కమిటీ ఏర్పాటు చేయడంపై ప్రస్తుత కమిటీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సంఘం బైలాకు అనుగుణంగా ఈ వివాదంపై రాష్ట్ర నాయకత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. వెంకటాపురం మండల కేంద్రంలోని కొమరం భీమ్ విగ్రహం వద్ద తుడుందెబ్బ వర్కింగ్ ప్రెసిడెంట్ సోడి శ్రీను అధ్యక్షతన నిర్వహించిన అత్యవసర సమావేశంలో మండల అధ్యక్షుడు తుర్స చంటి దొర మాట్లాడుతూ, 2025 ఆగస్టు 4న ఏర్పాటు చేసిన ప్రస్తుత కమిటీకి రెండేళ్ల కాలపరిమితి ఉండగా, ముందస్తు సమాచారం లేకుండా మరో కమిటీని ఏర్పాటు చేయడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మైపతి అరుణ్ కుమార్ జోక్యం చేసుకొని, ప్రస్తుత కమిటీ కొనసాగింపు, నూతన కమిటీ ఏర్పాటుపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ఆదివాసీ హక్కుల సాధన కోసం నాయకులంతా ఐక్యంగా పనిచేయాలని, అంతర్గత విభేదాలు సంఘం ప్రతిష్ఠకు భంగం కలిగించకుండా రాష్ట్ర నాయకత్వం తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకుడు పాయం వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు మిచ్ఛ సురేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ సోడి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
