- బొమ్మనపల్లిలో ‘మన ఇంటికి–మన బాత్రూం’పై కాఫెడ్ స్వచ్ఛంద సంస్థ అవగాహన సదస్సు
- బహిరంగ మలవిసర్జనకు స్వస్తి పలకాలి.. పరిశుభ్రతను ప్రతి కుటుంబం బాధ్యతగా తీసుకోవాలి
తెలుగు గళం వాజేడు, ములుగు, అక్టోబర్ 28:
మరుగుదొడ్డి వినియోగంతోనే ఆరోగ్యకరమైన కుటుంబం, పరిశుభ్రమైన గ్రామం సాధ్యమవుతుందని, ప్రతి ఇంటిలో సురక్షితమైన మరుగుదొడ్డి ఉండటంతో పాటు దానిని క్రమం తప్పకుండా వినియోగించాలని కాఫెడ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పిలుపునిచ్చారు. ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో బుధవారం కాఫెడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ‘మన ఇంటికి–మన బాత్రూం’ కార్యక్రమాన్ని నిర్వహించి, వ్యక్తిగత పరిశుభ్రత, మరుగుదొడ్డి వినియోగం, పరిసరాల శుభ్రతపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రహీం మాట్లాడుతూ, “ప్రతి ఇంటికి మరుగుదొడ్డి.. ఆరోగ్యకరమైన కుటుంబానికి తొలి అడుగు” అని పేర్కొన్నారు. ప్రతి కుటుంబం తమ ఇంటితో పాటు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయకుండా మరుగుదొడ్లను వినియోగించడం అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. పరిశుభ్రత అనేది ఒక్కరి బాధ్యత మాత్రమే కాదని, కుటుంబ సభ్యులందరూ భాగస్వాములై గ్రామాన్ని స్వచ్ఛంగా, ఆరోగ్యంగా తీర్చిదిద్దాలని కోరారు. మరుగుదొడ్లను క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల మలవిసర్జన ద్వారా వ్యాపించే వ్యాధుల ముప్పును తగ్గించవచ్చని, ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధుల భద్రతకు మరుగుదొడ్లు ఎంతో అవసరమని వివరించారు. బహిరంగ మలవిసర్జన వల్ల ఎదురయ్యే ఇబ్బందులను నివారించడంతో పాటు మహిళల ఆత్మగౌరవం, గోప్యతను కాపాడటంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. గ్రామంలో పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కార్యక్రమంలో పాల్గొన్నవారు సూచించారు. మరుగుదొడ్డి నిర్మాణంతో పాటు దాని నిర్వహణ, పరిశుభ్రతపై కూడా ప్రతి కుటుంబం శ్రద్ధ వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, వాజేడు మండల కోఆర్డినేటర్ గొంది కామేశ్వరరావు, భాస్కర్, రమాదేవి, దీప, ప్రసాద్, మహిళలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
