- సోమవారం కలెక్టర్‌తో ముఖాముఖి సమావేశం.. కార్మికులకు ప్రత్యేక అనుమతి ఇవ్వాలి
- మండల విద్యాధికారులకు విజ్ఞప్తి చేసిన పారిశుద్ధ్య కార్మికుల సంఘం నాయకులు
తెలుగు గళం ములుగు జిల్లా, అక్టోబర్ 29:
ములుగు జిల్లాలోని జిల్లా పరిషత్ పాఠశాలల్లో పనిచేస్తూ విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న 327 మంది పారిశుద్ధ్య కార్మికుల జీతాల సమస్యను పరిష్కరించేందుకు అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని సంఘం నాయకులు కోరారు. ఈ సమస్యపై సోమవారం జిల్లా కలెక్టర్‌తో ముఖాముఖి సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో, సమావేశానికి హాజరయ్యే కార్మికులకు ఒకరోజు ప్రత్యేక అనుమతి మంజూరు చేయాలని సంబంధిత మండల విద్యాధికారులకు విజ్ఞప్తి చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ్ రెడ్డి కార్మికుల జీతాల సమస్యపై సోమవారం కలెక్టర్‌తో సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు నాయకులు వెల్లడించారు. ఈ సమావేశం కార్మికుల సమస్య పరిష్కారానికి కీలకంగా మారనున్నందున, జిల్లాలోని అన్ని మండలాల పారిశుద్ధ్య కార్మికులు సమయానికి కలెక్టరేట్‌కు చేరుకునేలా అధికారులు సహకరించాలని కోరారు. జిల్లా విద్యాశాఖ అధికారి సూచనల మేరకు ఆదివారం రోజే సంబంధిత పాఠశాలలను పూర్తిస్థాయిలో శుభ్రం చేసి, సోమవారం ఉదయం 9 గంటలకు కార్మికులందరూ కలెక్టరేట్‌కు హాజరవుతారని తెలిపారు. సమావేశానికి హాజరయ్యేందుకు వీలుగా సోమవారం ఒక్కరోజు సంబంధిత ప్రధానోపాధ్యాయుల ద్వారా అనుమతి ఇప్పించాలని మండల విద్యాధికారులను కోరారు. అనుమతి విషయంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే జిల్లా విద్యాశాఖ అధికారిని సంప్రదించవచ్చని కూడా సూచించారు. కార్మికుల శ్రమకు తగిన గుర్తింపు, వారి జీతాల సమస్యకు న్యాయమైన పరిష్కారం లభించాలి. పాఠశాలల పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమిస్తున్న కార్మికుల ఆర్థిక ఇబ్బందులను అధికారులు గుర్తించి, వారి సమస్య పరిష్కారానికి సానుకూల నిర్ణయం తీసుకోవాలని సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షులు యనమళ్ళ ప్రవీణ్ కుమార్, జిల్లా అధ్యక్షులు వాసం ఆదినారాయణ, ఏటూరునాగారం మండల అధ్యక్షులు రాచకొండ ఎలింద్ర కార్మికులకు ప్రత్యేక అనుమతి కల్పించాలని కోరారు.
