వెంకటాపూర్ అభివృద్ధికి రూ.99 లక్షల నిధులు!
- గ్రామాల రూపురేఖలు మార్చడమే లక్ష్యం.. రూ.99 లక్షలతో సీసీ రోడ్లు, డ్రెయిన్ల ప్రారంభం!
- ప్రజల అవసరాలే ప్రాధాన్యం.. గ్రామీణ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి సీతక్క
తెలుగు గళం వెంకటాపూర్, ములుగు అక్టోబర్ 29:
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, గ్రామాల అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించి పనులను దశలవారీగా చేపడతామని తెలిపారు. గురువారం ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రంలో రూ.99 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్లు, సీసీ డ్రెయిన్లను మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, చైర్మన్ శ్రీనివాస్‌తో పాటు నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. వెంకటాపూర్ మండల కేంద్రంలోని అంతర్గత రహదారులు, మురుగునీటి కాలువల నిర్మాణానికి పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ ఆధ్వర్యంలో నిధులు కేటాయించారు. సీఆర్ఆర్ (ప్లెయిన్) 2025–26 నిధుల నుంచి రూ.54 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్లు, సీఆర్ఆర్ (ఎస్సీపీ) 2024–25 నిధుల నుంచి రూ.45 లక్షల అంచనా వ్యయంతో సీసీ డ్రెయిన్ల పనులు చేపట్టారు. ఈ పనుల ప్రారంభంతో స్థానిక ప్రజలకు మెరుగైన రహదారి సదుపాయాలు, పారిశుధ్య నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులు అందుబాటులోకి రానున్నాయి. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, గతంలో వెంకటాపూర్‌లోని కాలనీలో పర్యటించిన సమయంలో స్థానిక ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. స్థానిక సర్పంచ్, నాయకులు, ప్రజలు చేసిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని పనులు చేపట్టామని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయడమే ప్రజాప్రతినిధుల బాధ్యతని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, డ్రెయిన్లు, తాగునీరు వంటి ప్రాథమిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రతి గ్రామానికి అవసరమైన అభివృద్ధి పనులను గుర్తించి, అందుబాటులో ఉన్న నిధులతో దశలవారీగా పూర్తి చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. గ్రామాల అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవని నేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటి వనరులను ప్రతి ఒక్కరూ పొదుపుగా వినియోగించుకోవాలని మంత్రి సీతక్క సూచించారు. రైతులు, వ్యవసాయ కూలీలు, మహిళలు, ప్రతి కుటుంబం నీటిని వృథా చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. నీటి వనరులను సంరక్షించుకుంటూ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి సీతక్క తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం కృషి చేస్తామని ఆమె స్పష్టం చేశారు.
