ప్రజా భవన్లో సిఐటియు వినతి పత్రం అందజేత
సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 2026 అక్టోబర్ 25, 26 తేదీల్లో వివిధ రంగాల కార్మికుల సమస్యలను పరిష్కరించాలి, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలను అమలు చేయాలని కోరుతూ వేలాది మంది కార్మికులతో మల్టిపుల్ డేస్ మహాధర్నా హైదరాబాద్‌లో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వచ్చిన కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు ఈరోజు (తేది: 30`10`2026)న సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రజాభవన్‌లో నోడల్ అధికారి గద్వాల్ విజయలక్ష్మికి వినతి పత్రం అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర పరిధిలోని అనేక సమస్యలు పరిష్కారం కానందున కార్మికులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ రాష్ట్రంలో అమలు చేస్తే కార్మికులు మరింత నష్టపోయి వెట్టిచాకిరి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, కార్మికుల హక్కులను కాలరాసే 4 లేబర్ కోడ్లు అమలు నిర్ణయాన్ని మన రాష్ట్రంలో నిలుపుదల చేయాలని, ఇతర సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రైవేట్ రంగంలో భారీ, మధ్యతరహా, చిన్న, సూక్ష్మ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమం కోసం కార్మిక చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి. 4 లేబర్ కోడ్స్ రూల్స్ రాష్ట్రంలో అమలు చేయరాదు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు సవరించాలి. 15వ ఐఎల్‌సి తీర్మానం, 1992 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కార్మికుల జీవన వ్యయం లెక్కిస్తే ప్రస్తుతం రూ.42,000/-లు కనీస వేతనం నిర్ణయించాలి. తేది: 01-06-2026న రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీఓ నెం.6లో అతి తక్కువ వేతనాలు నిర్ణయించారు. ఆ వేతనాలను కూడా రాష్ట్రంలో ఎక్కడా, ఏ పరిశ్రమల్లో అమలు చేయడం లేదు. జీఓ నెం.6ను అన్ని పరిశ్రమల్లో ఖచ్చితంగా అమలు చేయించేలా చర్యలు తీసుకోవాలి. భౌగోళికంగా (జోన్స్ ఆధారంగా) నిర్ణయించిన వేతనాల పద్ధతిని రద్దు చేయాలి. కార్మిక సంక్షేమ చట్టాలు అయిన కనీస వేతనం, ఈఎసఐ, పిఎఫ్, బోనస్, సెలవులు, రక్షణ సౌకర్యాలు, పని ప్రదేశంలో సౌకర్యాలు పటిష్టంగా అమలు చేయుటకు యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి.
రాష్ట్రంలో పరిశ్రమల్లో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలామంది కార్మికులు ముఖ్యంగా కాంట్రాక్ట్ వర్కర్స్ వలస కార్మికులు చనిపోతున్నారు. పరిశ్రమలలో భద్రతా ప్రమాణాలు పాటించడం లేదు. ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణ కొరవడింది. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారం అందడం లేదు. సిగాచి కార్మికులకు ముఖ్యమంత్రి ప్రకటించిన కోటి రూపాయలు నష్టపరిహారం నేటికీ అందలేదు. రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు ప్రకారం ఆశ, అంగన్వాడీ, ఐకెపి విఓఏలకు ఫిక్స్డ్ వేతనం రూ.18,000/`లు ఇవ్వాలని, మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.10,000/`ల కనీస వేతనం ఇవ్వాలని, మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని, మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, పిఆర్సిని వెంటనే ప్రకటించి అమలు చేయాలని, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, స్కీమ్ వర్కర్స్‌కి రాష్ట్ర పిఆర్సిలో రూ.30,000/`లు స్కేల్ నిర్ణయించి అమలు చేయాలని, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్, హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, బీడీ కార్మికులకు కనీస పెన్షన్ రూ.7,000/`లు ఇవ్వాలని, 55 సం॥లు నిండిన భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, విఆరఏ వారసులకు జీవో నెం.81 ప్రకారం వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని, వ్యవసాయ మార్కెట్ సెక్యూరిటీ గార్డ్లకు లాస్ట్ గ్రేడ్ 4 విధానం అమలు చేయాలని, ప్రభుత్వ మీ`సేవ సిబ్బందిని పర్మినెంట్ చేయాలని, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ వేతనాలు చెల్లించాలి, వైద్య ఆరోగ్యశాఖలోని కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసులను రెగ్యులైజేషన్ చేయాలని, 104 ఉద్యోగుల బకాయి జీతాలు చెల్లించాలని, ఆర్టీసీ కార్మికులకు పెండింగ్‌లో ఉన్న పిఆర్సి బకాయిలు చెల్లించడంతో పాటు ప్రభుత్వంలో విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు చెల్లిస్తామని హామీని అమలు చేయాలి. సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులకు స్వంత ఇంటి పథకం అమలు చేయడం, పెర్మ్స్ పైన ఇన్‌కమ్‌టాక్స్ రీ`ఎంబర్స్మెంట్ చేయాలి. సింగరేణికి బొగ్గు బ్లాకులు కేటాయించాలి. రాష్ట్ర ప్రభుత్వ హామీతో జెన్కో, ఇతర సంస్థలకు సింగరేణి బొగ్గు సప్లై చేసింది. రూ.56 వేల కోట్లు బకాయిలు ఉన్నాయి. వాటిని తక్షణం చెల్లించి సంస్థను ఆదుకోవాలి. సింగరేణిలో 30,000 మంది కాంట్రాక్ట్ వర్కర్స్కు హైపవర్ వేజెస్ చెల్లించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. విద్యుత్ రంగంలో 23,000 మంది ఆర్టిజెన్స్ సర్వీసులను కన్వర్షన్ చేయాలి. ఏపిఎస్ రూల్స్ అమలు చేయాలని కోరారు. పై సమస్యలపై సానుకూలంగా స్పందించి ఈ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్, ఎస్వీ. రమ, పి. జయలక్ష్మి, వి.ఎస్. రావు, కె. ఈశ్వర్రావు, సిఐటియు రాష్ట్ర కార్యదర్శులు జె. వెంకటేష్, ఎం. పద్మశ్రీ, కె. రమేష్, పుప్పాల శ్రీకాంత్, కె. గోపాలస్వామి, పి. సుధాకర్, రాష్ట్ర కమిటీ సభ్యులు యాటల సోమన్న, ఎ. సునీత, మధ్యాహ్న భోజనం యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వై. స్వప్న, ఐకెపి విఓఏ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నగేష్, ఇంజనీరింగ్ కాలేజ్ వర్కర్స్ యూనియన్ నాయకులు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
ప్రజా భవన్లో సిఐటియు వినతి పత్రం అందజేత