దనసరి అనసూయ సీతక్క.దనసరి అనసూయ సీతక్క.
  • రామప్పలో రూ.13 కోట్లతో ఐలాండ్ అభివృద్ధి.
  • గ్రామాల్లో పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక యాప్.
  • ఉపాధి కోరిన వారందరికీ జాబ్‌కార్డులు.. పని కల్పించాలి.
  • రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి – దనసరి అనసూయ సీతక్క.

తెలుగు గళం న్యూస్ ములుగు.అక్టోబర్ 30

ములుగు జిల్లాలోని జంగాల్‌పల్లి గుట్టను టేబుల్ మౌంటెన్ తరహాలో అభివృద్ధి చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. జిల్లాలోని సహజ వనరులు, చారిత్రక ప్రదేశాలను పరిరక్షిస్తూ పర్యాటక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.శుక్రవారం ములుగు నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని తన స్టేట్ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనాలతో కలిసి మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, చేపట్టాల్సిన పనులు, పర్యాటక అభివృద్ధి, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, గ్రామీణ ఉపాధి, తాగునీటి సరఫరా తదితర అంశాలపై సమీక్షించారు.ధాన్యం కొనుగోలు కేంద్రాలను సత్వరమే ప్రారంభించి, కొనుగోళ్లలో ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అటవీ అనుమతుల కారణంగా ముందుకు సాగని మారుమూల గ్రామాల రహదారి పనులపై సమీక్షించారు. జిల్లా కలెక్టర్, జిల్లా అటవీ శాఖ అధికారి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సమన్వయంతో జిల్లా స్థాయి కమిటీ ద్వారా అనుమతుల ప్రక్రియను చేపట్టాలని సూచించారు. పంచాయతీరాజ్ శాఖ, ఐటీడీఏ ద్వారా ఇప్పటికే మంజూరైన రహదారి పనులను పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు.అనంతరం మీడియా ప్రతినిధులతో మంత్రి అనసూయ సీతక్క మాట్లాడుతూ, గత రెండు రోజులుగా ములుగు జిల్లాలో పర్యటిస్తూ వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతోపాటు జిల్లా అభివృద్ధిపై సమీక్షించినట్లు తెలిపారు. జంగాల్‌పల్లి గుట్టకు దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో తాము సందర్శించిన టేబుల్ మౌంటెన్‌ను పోలిన ఆకృతి ఉందని వివరించారు. గుట్టపై నుంచి ఒకవైపు లక్నవరం, మరోవైపు రామప్ప కనిపించే మంచి వ్యూ పాయింట్ ఉన్నందున పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. మాస్టర్ ప్లాన్ రూపొందించేందుకు ఆర్కిటెక్ట్‌లు, ఇతర నిపుణులను ఆహ్వానించి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని చెప్పారు.రామప్పలో రూ.13 కోట్లతో ఐలాండ్‌ను అభివృద్ధి చేస్తున్నామని, మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు కొత్త డిజైన్‌ను తీసుకొచ్చినట్లు తెలిపారు. జిల్లాలో వెలుగులోకి వస్తున్న గుహలు, గుట్టలు, కోటలు, పురాతన ఆలయాలను పరిరక్షిస్తామని పేర్కొన్నారు. పాత కట్టడాలకు భంగం కలగకుండా కొత్త నిర్మాణాలు చేపడతామని చెప్పారు.గ్రామ సమగ్ర ప్రణాళికలో భాగంగా గ్రామాల్లో ఉన్న వసతులు, చేపట్టాల్సిన పనులు, మంజూరైన పనుల పురోగతి తదితర వివరాలను తెలుసుకునేందుకు ప్రత్యేక యాప్‌ను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. పనులకు సంబంధించిన ఫొటోలను అప్‌లోడ్ చేయడం ద్వారా వాటి స్థితిని పరిశీలించే అవకాశం ఉంటుందన్నారు. ఏ గ్రామానికి ఏ పనులు మంజూరయ్యాయి, ఎన్ని పూర్తయ్యాయి, మిగిలిన పనులు ఎందుకు పూర్తి కాలేదనే వివరాలను తాను, సంబంధిత కార్యదర్శి, కమిషనర్ నేరుగా తెలుసుకొని అధికారులతో మాట్లాడేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని వివరించారు.ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కోవడంతోపాటు గ్రామాల్లో ఆస్తులను సృష్టించేందుకు ఉపాధి హామీ పథకంలో 375 రకాల పనులు చేపట్టవచ్చని వివరించారు.వీవో భవనాలు, గ్రామపంచాయతీ భవనాలు, కమ్యూనిటీ హాళ్లు, గ్రంథాలయాలు, పాఠశాల భవనాలు, మరుగుదొడ్లు, వివాహ కార్యక్రమాల కోసం రూ.15 లక్షలతో భవనాలు నిర్మించుకోవచ్చని తెలిపారు. చెరువుల్లో పూడికతీత, డ్రైనేజీలు, సీసీ రోడ్లు, మట్టి రోడ్లు, వ్యవసాయ క్షేత్రాలకు రహదారులు వంటి పనులు చేపట్టవచ్చన్నారు. బీటీ రహదారులను కూడా రూ.1,000 నుంచి రూ.1,500 కోట్లతో చేపట్టబోతున్నట్లు పేర్కొన్నారు.సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారులు ఉపాధి పనుల్లో చురుగ్గా వ్యవహరించాలని మంత్రి సూచించారు. గ్రామాల్లో పనులకు హాజరయ్యే కూలీల సంఖ్యను పెంచడం ద్వారా మరిన్ని మెటీరియల్ పనులు చేపట్టేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రతి రెండు నెలలకు పనులను మార్చుకుంటూ, ఒక్కోసారి 30 నుంచి 40 రకాల పనులు చేపట్టాలని సర్పంచులకు సూచించినట్లు తెలిపారు.ఇప్పటికే రెండుసార్లు నేరుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించామని, ఇటీవల అధికారులు, సర్పంచులతో కలిపి దాదాపు 23 వేల మంది పాల్గొన్నట్లు చెప్పారు. పనుల సమన్వయానికి ఎంపీడీవో చైర్మన్‌గా మండల స్థాయిలో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.కరువు కాలంలో ఉపాధి కోరిన వారందరికీ జాబ్‌కార్డులు ఇచ్చి పని కల్పించాలనే సంకల్పంతో పనిచేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. పని దొరకలేదనే పరిస్థితి రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి పనులను గుర్తించి, పనుల సంఖ్యను పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి సందర్భంలోనూ సూచిస్తున్నారని తెలిపారు. తొమ్మిది నెలల కాలంలో ప్రజలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో విస్తృత ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు.తాగునీటి సరఫరాలో సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. కొత్త రహదారుల నిర్మాణం, విద్యుత్ లైన్ల మార్పు, పైప్‌లైన్ మరమ్మతుల కారణంగా సరఫరాకు అంతరాయం ఏర్పడితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఏ ప్రాంతంలో ఎందుకు నీటి సరఫరా నిలిచిందనే విషయాన్ని సంబంధిత వాట్సాప్ గ్రూపులు, పత్రికల ద్వారా ప్రజలకు తెలియజేయాలని అధికారులకు సూచించినట్లు చెప్పారు.తాగునీటి సమస్యలపై వాస్తవాలను తెలియజేస్తే పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని, అవాస్తవ ప్రచారం చేయవద్దని మంత్రి కోరారు. కరువు పరిస్థితులను అధిగమించేందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు సి.హెచ్. మహేందర్ జి, సంపత్ రావు, టూరిజం నోడల్ అధికారి ధర్మ నాయక్, డీఆర్‌డీఓ రవీందర్, పంచాయతీరాజ్ ఈఈ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు..

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *