తెలుగు గళం న్యూస్ ఐనవోలు /అక్టోబర్ 30
ఐనవోలు:జిల్లా న్యాయ సేవాధికార సంస్థ హనుమకొండ ఆధ్వర్యంలో పిల్లలపై లైంగిక నేరాల నుంచి రక్షణ కల్పించే పోక్సో చట్టం పై అవగాహన కల్పించేందుకు చేపట్టిన సురక్షిత్ బచ్పన్ అభియాన్ అఖిల భారత పాఠశాల అవగాహన ప్రచారంలో భాగంగా ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లి గ్రామంలోని ప్రధానమంత్రి శ్రీ పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో న్యాయ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.వి.హైమ పూజిత మాట్లాడుతూ పోక్సో చట్టం ప్రాధాన్యతను వివరించారు. బాలల హక్కులు,వారి భద్రత,వ్యక్తిగత రక్షణ, మంచి స్పర్శ చెడు స్పర్శ మధ్య తేడా, అనుమానాస్పద పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. లైంగిక వేధింపులకు గురైనప్పుడు భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు.
బాలలపై నేరాలు జరిగినప్పుడు దాచిపెట్టకుండా చట్టపరమైన సహాయం పొందేందుకు ముందుకు రావాలని,నివారణలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సదానందం,సహాయ ఉప తనిఖీదారు గణపతి, సర్పంచ్ స్రవంతి,పాఠశాల సిబ్బంది పాల్గొని పోక్సో చట్టంలోని ముఖ్య నిబంధనలు,ఫిర్యాదు విధానం,పిల్లల సహాయ కేంద్ర సేవల గురించి వివరించారు.
బాలల హక్కుల పరిరక్షణ, లైంగిక నేరాల నివారణపై అవగాహన పెంపొందించడం,సురక్షిత వాతావరణం కల్పించడం ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
