ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలిఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలి

ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలి..!”

  • అభివృద్ధి నిష్పత్తి ప్రకారం ఆదివాసీలకు హక్కులు కల్పించాలి
  • విద్య నుంచి రాజకీయాల వరకు.. ప్రతి రంగంలో ఆదివాసీలకు న్యాయమైన వాటా ఇవ్వాలి
  • ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం తప్పదు: తుడుం దెబ్బ నాయకుల డిమాండ్

తెలుగు గళం గోవిందరావుపేట, నవంబర్ 1:

షెడ్యూల్డ్ తెగలలో సామాజిక న్యాయం సాధించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని తుడుం దెబ్బ జాతీయ నాయకులు పోదెం కృష్ణ ప్రసాద్, మాదిగ దండోరా జాతీయ నాయకులు దళితరత్న నెమలి నర్సయ్య మాదిగ డిమాండ్ చేశారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పసర చౌరస్తాలోని ఆదివాసీ పోరాట యోధుడు కొమరం భీమ్ విగ్రహానికి తుడుం దెబ్బ, ఎమ్మార్పీఎస్, ప్రజా సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తుడుం దెబ్బ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్య, ఉద్యోగ, ఉపాధి, సంక్షేమ, రాజకీయ రంగాల్లో షెడ్యూల్డ్ తెగల జనాభా, అభివృద్ధి నిష్పత్తికి అనుగుణంగా న్యాయమైన వాటా కల్పించాలని కోరారు. సామాజిక ఉద్యమాల ద్వారా సాధించిన సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ తెగలందరికీ అన్ని రంగాల్లో సమాన అవకాశాలు, సామాజిక న్యాయం కల్పించేందుకు ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలని నాయకపోడ్ దెబ్బ వ్యవస్థాపక అధ్యక్షులు దబ్బా సుధాకర్ నాయకపోడ్ కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి చింత కృష్ణ అధ్యక్షత వహించగా, తుడుం దెబ్బ గోవిందరావుపేట మండల అధ్యక్షులు గొంది కిరణ్ ఆదివాసి జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల ఐక్యవేదిక చైర్మన్ ముంజల బిక్షపతి గౌడ్, ఆదివాసీ పూజారుల సంఘం జిల్లా అధ్యక్షులు సిద్ధబోయిన స్వామి, మహిళా నాయకురాలు పెనక సుగుణ, ఆదివాసీ ఉద్యోగ సంఘాల నాయకులు కొమురం నర్సయ్య, అలెం భాస్కర్, పెండకట్ల బాలరాజు, ఎట్టి ఎల్లయ్య, యాప కన్నయ్య, ఎర్నె ధనుంజయ్య, ఈక జగ్గారావు, వట్టం సురేష్ తదితర నాయకులు, ఆదివాసీ యువత, విద్యార్థులు, వందలాది మంది ఆదివాసీ ప్రజలు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *