కడియం శ్రీహరి అంటే కమిట్మెంట్ కాదు.. కమిషన్స్
అభివృద్ధి పనుల అంచనా వ్యయాలు పెంచి కమీషన్లు దండుకుంటున్నాడు
జఫర్గడ్ చుట్టూ రోడ్డు, లక్ష్మీనరసింహస్వామి గుట్టపైకి రోడ్డు నిర్మించిన ఘనత నాదే
కడియం శ్రీహరీ బహిరంగ చర్చకు సిద్ధమా!అంటూ రాజయ్య సవాల్

జఫర్గడ్, నవంబర్ 21 (E69NEWS -తెలుగు గళం దినపత్రిక )
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధిని విస్మరించి కల్లు తాగిన కోతిలెక్క పిచ్చికూతలు కూస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య తీవ్రస్థాయిలో విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిపితే, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ప్రతిష్ట దిగజారుతోందని అన్నారు. డిసెంబర్ 7 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మూడేళ్లు పూర్తవుతున్నా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని విమర్శించారు.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పేరుతో పురుషులపై డబుల్ ఛార్జీల భారం మోపుతున్నారని ఆరోపించారు. ప్రజలు కోరని ఫోర్త్ సిటీ, హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తూ ప్రభుత్వం రాక్షస ఆనందం పొందుతోందని మండిపడ్డారు.జనగామ జిల్లా జఫర్గడ్ మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాజయ్య మాట్లాడుతూ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సమస్యలపై దృష్టి సారించకుండా అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.ఇదే సమావేశంలో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై కూడా రాజయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.కడియం శ్రీహరి అంటే కమిట్మెంట్ కాదని..కమిషన్లేనని ఎద్దేవా చేశారు.బీఆర్ఎస్ కార్యకర్తల శ్రమతో గెలిచి, కేవలం తన కుమార్తె రాజకీయ భవిష్యత్తు, వ్యక్తిగత స్వార్థం కోసమే కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆరోపించారు. అభివృద్ధి కోసమే పార్టీ మారానని చెబుతున్న ఆయన జఫర్గడ్ మండలంలో ఏం అభివృద్ధి చేశారో ప్రజలకు చూపించాలని సవాల్ విసిరారు.గతంలో తాను మంజూరు చేయించిన అభివృద్ధి పనులకు సంబంధించిన అంచనా వ్యయాలను కడియం శ్రీహరి భారీగా పెంచి కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు దండుకుంటున్నారని రాజయ్య ఆరోపించారు.రాష్ట్రంలో కమీషన్లు లేనిదే పనులు జరిగే పరిస్థితి లేదని, 20 నుంచి 30 శాతం వరకు కమీషన్లు ఇస్తేనే బిల్లులు మంజూరవుతున్నాయని విమర్శించారు. ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోందని, అధికార పార్టీలోని నాయకులే బహిరంగంగా ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారని అన్నారు.నియోజకవర్గంలోని ప్రతి మండలంలో మోడల్ స్కూల్స్, కస్తూర్బా పాఠశాలలు, జ్యోతిరావు పూలే గురుకులాలు, మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు, మహిళా డిగ్రీ కళాశాల వంటి విద్యాసంస్థలను తన హయాంలోనే ఏర్పాటు చేశామని రాజయ్య తెలిపారు. ఇప్పుడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల పేరుతో కేవలం గ్రావెల్ కోసమే రూ.17 కోట్ల అంచనా వ్యయం రూపొందించారని ఆరోపించారు. స్థానికంగా ఇసుక, మొరం అక్రమంగా తవ్వుతూ సమీపంలోని పాఠశాలలు, అనాథ ఆశ్రమాలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని విమర్శించారు.ఉప్పుగల్ రిజర్వాయర్, లింగంపల్లి రిజర్వాయర్ కాలువల నిర్మాణ పనులకు సంబంధించిన అంచనా వ్యయాలను పెంచి కాంట్రాక్టర్ల నుంచి భారీగా కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. తాను రూ.37.50 కోట్లతో మంజూరు చేయించిన స్టేషన్ ఘన్పూర్ 100 పడకల ఆసుపత్రి నిర్మాణ అంచనా వ్యయాన్ని రూ.45.50 కోట్లకు పెంచారని, అయినప్పటికీ పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయని విమర్శించారు.జఫర్గడ్లో 50 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు కూడా తన హయాంలోనే నిర్మించినట్లు గుర్తుచేశారు.జఫర్గడ్ మండల అభివృద్ధిలో తన హయాంలో చేపట్టిన పనులను రాజయ్య ప్రత్యేకంగా ప్రస్తావించారు. జఫర్గడ్ మండల కేంద్రం చుట్టూ రోడ్డు నిర్మించిన ఘనత తనకే దక్కుతుందని తెలిపారు. జఫర్గడ్ గుట్టపై వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు సులభంగా చేరుకునేందుకు కొండపైకి రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించి రోడ్డు వేయించామని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు తన హయాంలో ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు.రాష్ట్రంలో కాంట్రాక్టర్లు, సర్పంచులు తాము చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాజయ్య అన్నారు.బిల్లులు చెల్లించకపోవడంతో కొందరు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన వారి పెన్షన్లను రద్దు చేసి తమ అనుచరులకు కేటాయిస్తున్నారని ఆరోపించారు.తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 23 వేల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయించి పూర్తి చేయించానని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఒక్క ఇల్లు కూడా పూర్తిస్థాయిలో నిర్మాణం కాలేదని విమర్శించారు.ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేరు రావాలంటే కమిటీలకు రూ.50 వేల వరకు లంచం ఇవ్వాల్సిన దుస్థితి నెలకొందని ఆరోపించారు.జనగామ జిల్లా ఏర్పాటు, స్టేషన్ ఘన్పూర్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు, వేలేరు, చిల్పూరు మండలాల ఏర్పాటు, 34 నూతన గ్రామపంచాయతీల ఏర్పాటు తన హయాంలోనే జరిగాయని రాజయ్య గుర్తుచేశారు. తండాలకు బీటీ రోడ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు.ఆకేరుపై రూ.12 కోట్లతో ఫ్లైఓవర్ బ్రిడ్జి, రూ.5 కోట్లతో చెక్‌డ్యామ్, 50 పడకల ఆసుపత్రి, డయాలసిస్ కేంద్రం, జఫర్గడ్ కోట అభివృద్ధి, రైల్వే అండర్‌పాస్ వంటి అనేక అభివృద్ధి పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని వివరించారు.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం గణనీయమైన అభివృద్ధి సాధించిందని, కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జఫర్గడ్ మండలం అభివృద్ధిలో వెనుకబడిపోయిందని విమర్శించారు. అభివృద్ధి విషయంలో తనకు, కడియం శ్రీహరికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని వ్యాఖ్యానించారు.తన ఎమ్మెల్యే హయాంలో పల్లెనిద్ర కార్యక్రమం ద్వారా గ్రామ గ్రామాన పర్యటించి ప్రజల మధ్య కూర్చొని వారి సమస్యలను తెలుసుకున్నానని రాజయ్య తెలిపారు.సంక్షేమ హాస్టళ్లలో నిద్రిస్తూ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా పరిశీలించి పరిష్కారానికి కృషి చేశానని చెప్పారు.మైనారిటీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్ల ఏర్పాటు కూడా బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందని గుర్తుచేశారు.కడియం శ్రీహరికి రాజయ్య బహిరంగ సవాల్ విసిరారు. ఏ గ్రామానికి వచ్చినా, ఏ తండాకు వెళ్లినా గ్రామ నడిబొడ్డున కూర్చొని అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు.తన హయాంలో జరిగిన అభివృద్ధి, ప్రస్తుత ఎమ్మెల్యే హయాంలో జరిగిన అభివృద్ధిపై ప్రజల సమక్షంలో చర్చిద్దామని సవాల్ విసిరారు. 2004 వరకు మాత్రమే కడియం శ్రీహరి ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నారని, ఆ తర్వాత తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి,కన్వీనర్ పెంతల రాజకుమార్,మండల సమన్వయ సమితి సభ్యులు యారా సోమిరెడ్డి,మారేపల్లి కరుణాకర్, కొత్వాల్ కుమార్, నాయిని నరేష్, గండి నజిర్, పిన్నింటి విజయ్,ఉప-సర్పంచులు కలకోట మనోహర్, రాజు, పులి ధనుంజయ్,గబ్బెట కొమురయ్య,సింగరపు శ్రీధర్,నల్లతీగల రవి,మేరుగు రమేష్,ఎండి బషీర్, సొన్నాయిల నాగరాజు,కొంతం నగేష్ తిరుమల్ రెడ్డి లతో పాటు తదితర బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.