తెల్లవారుజామున చలిని సైతం లెక్కచేయకుండా తండాల్లో కార్డన్ సెర్చ్
300 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం.. 25 లీటర్ల నాటుసారా స్వాధీనం
తెలుగు గళం న్యూస్ మహబూబాబాద్ జిల్లా.
జిల్లాలో అక్రమ గుడుంబా తయారీ, విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తెల్లవారుజామున ప్రజలు నిద్రలేవకముందే చలిని సైతం లెక్కచేయకుండా పోలీసులు తండాల్లోకి వెళ్లి విస్తృత తనిఖీలు నిర్వహించడం అక్రమ కార్యకలాపాలకు పాల్పడేవారిలో భయాన్ని కలిగిస్తోంది.మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీసుల ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 5:30 నుంచి 7:30 గంటల వరకు మండల పరిధిలోని గుర్రప్ప తండా మంచా తండాలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. మరిపెడ సర్కిల్ పోలీసు సిబ్బంది సంయుక్తంగా ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఎస్ఐ బానోత్ వెంకన్న ఆధ్వర్యంలో తండాల్లో అక్రమంగా నాటుసారా తయారీ, నిల్వ, రవాణా జరుగుతున్న ప్రాంతాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా 300 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేయడంతో పాటు, 25 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ద్విచక్ర వాహనాలను తనిఖీ చేసి వాటి రికార్డులు, ధ్రువపత్రాలను పరిశీలించారు.తనిఖీల అనంతరం తండావాసులకు గంజాయి వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, పోక్సో చట్టం, బాల్యవివాహాల నిరోధం తదితర అంశాలపై పోలీసు అధికారులు అవగాహన కల్పించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.అక్రమ నాటుసారా తయారీ, విక్రయాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కేసులు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్ఐ వెంకన్న తెలిపారు.తెల్లవారుజామునే పోలీసుల బృందాలు తండాల్లోకి చేరుకుని నిర్వహించిన ఈ తనిఖీలు అక్రమ మద్యం తయారీదారులకు గట్టి హెచ్చరికగా నిలిచాయి. చలిని సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించిన పోలీసుల చర్యలను పలువురు తండా వాసులు అభినందిస్తున్నారు.ఈ కార్యక్రమం లో ఎస్ ఐ మహబుబి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
