అక్రిడిటేషన్ కార్డు ఉంటేనే ప్రెస్‌మీట్‌కు రావాలంటూ విలేకరికి ఆంక్షలు!

రంగరాయిగూడెం సర్పంచ్‌తో పాటు కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా ఉన్న శిరీష్ రెడ్డి తీరుపై విమర్శలు

మీడియాను శాసించే అధికారం ఎవరిచ్చారు? జర్నలిస్టుల ఆత్మగౌరవంతో ఆటలాడుతారా?

స్టేషన్ ఘన్‌పూర్, నవంబర్ 22(ఈ69న్యూస్)

గ్రామ సర్పంచ్‌గా, అధికార కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న జూలుకుంట్ల శిరీష్ రెడ్డి జర్నలిస్టుల పట్ల వ్యవహరించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావాల్సిన మీడియాపై ఆంక్షలు విధించే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి క్యాంపు కార్యాలయంలో నవంబర్ 22న నిర్వహించిన మీడియా సమావేశంలో ఓ విలేకరిని ఉద్దేశించి శిరీష్ రెడ్డి అక్రిడిటేషన్ కార్డు ఉంటేనే ప్రెస్‌మీట్‌లకు రావాలని, లేదంటే రావద్దంటూ పలువురు మీడియా ప్రతినిధుల సమక్షంలో హుకుం జారీ చేసినట్లు తెలిసింది. ఒక ప్రజాప్రతినిధి, రాజకీయ పార్టీ మండల అధ్యక్షుడి హోదాలో ఉన్న వ్యక్తి మీడియా ప్రతినిధిపై ఈ విధంగా ఆంక్షలు విధించడం పత్రికా వర్గాల్లో చర్చకు దారితీసింది.

సర్పంచ్‌గా ప్రజాస్వామ్య విలువలు పాటించాల్సిన బాధ్యత లేదా?

రంగరాయిగూడెం గ్రామ సర్పంచ్‌గా ప్రజల ఓట్లతో ఎన్నికైన శిరీష్ రెడ్డి గ్రామ ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన బాధ్యత ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా రాజకీయ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి కీలక బాధ్యతల్లో ఉన్న వ్యక్తి జర్నలిస్టుల పట్ల గౌరవంగా వ్యవహరించాల్సింది పోయి, ఎవరు మీడియా సమావేశాలకు రావాలో, ఎవరు రావద్దో ఆదేశాలు జారీ చేయడం విమర్శలకు తావిస్తోంది.

అక్రిడిటేషన్ కార్డు లేకుంటే జర్నలిస్టు కాదా?

ప్రభుత్వం ఇచ్చే అక్రిడిటేషన్ కార్డు మాత్రమే జర్నలిజానికి కొలమానం కాదు. గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది విలేకరులు వివిధ పత్రికలు, వార్తా సంస్థలు, డిజిటల్ మీడియా వేదికల ద్వారా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తున్నారు. అలాంటి వారిని అక్రిడిటేషన్ లేదనే కారణంతో చిన్నచూపు చూడటం, ప్రెస్‌మీట్‌కు రావద్దని చెప్పడం ఏ విధంగా సమర్థనీయం? జర్నలిస్టుల వృత్తిపరమైన గుర్తింపును నిర్ణయించే అధికారం రాజకీయ నాయకులకు ఎవరిచ్చారు?

ప్రశ్నించే గొంతులను అడ్డుకోవాలనుకుంటున్నారా?

మీడియా సమావేశాలు రాజకీయ నాయకుల ప్రచార వేదికలు మాత్రమే కావు. ప్రజలకు సంబంధించిన అంశాలపై ప్రశ్నలు అడిగేందుకు, ప్రభుత్వ పనితీరును ప్రజల ముందుంచేందుకు అవి ఒక అవకాశం. విలేకరులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన నాయకులు, ముందుగానే వారికి అర్హతలు నిర్ణయిస్తూ ఆంక్షలు విధించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందన ఏమిటి?

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, రంగరాయిగూడెం సర్పంచ్‌గా ఉన్న శిరీష్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందిస్తారా? జర్నలిస్టుల పట్ల ఇలాంటి ఆంక్షలు విధించడం పార్టీ వైఖరేనా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

పదవులు ప్రజాసేవ కోసం.. పెత్తనం చెలాయించడానికి కాదు!

సర్పంచ్ పదవి అయినా, పార్టీ అధ్యక్ష పదవి అయినా ప్రజలకు సేవ చేయడానికి, ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి ఉపయోగపడాలి. జర్నలిస్టులను బెదిరించేలా లేదా అవమానించేలా వ్యవహరించడానికి కాదు. మీడియా ఎవరి సొత్తు కాదు.. జర్నలిజం ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడదు. అక్రిడిటేషన్ కార్డు పేరుతో విలేకరుల మధ్య వివక్ష చూపకుండా, ప్రతి మీడియా ప్రతినిధి ఆత్మగౌరవాన్ని గౌరవించాల్సిన బాధ్యత శిరీష్ రెడ్డిపై ఉంది. తన వ్యాఖ్యలపై ఆయన స్పష్టత ఇవ్వాలని, జర్నలిస్టుల పట్ల తన వైఖరిని మార్చుకోవాలని మీడియా వర్గాలు కోరుతున్నాయి.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *