బీఆర్ఎస్ దుష్ప్రచారానికి అభివృద్ధి పనుల వివరాలతో కౌంటర్
రూ.1,600 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టాం: కొలిపాక సతీష్
స్టేషన్ ఘనపూర్, నవంబర్ 27 ఈ69న్యూస్ -తెలుగు గళం

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆధ్వర్యంలో సుమారు రూ.1,600 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి కొలిపాక సతీష్ తెలిపారు.
నియోజకవర్గంలో అభివృద్ధి జరగడం లేదంటూ బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రచారానికి అడ్డుకట్ట వేసేందుకు చేపట్టిన పనులు, మంజూరైన నిధుల వివరాలతో కూడిన కరపత్రాలను ఆయన పంపిణీ చేశారు. అభివృద్ధి పనులపై ప్రజలకు వాస్తవాలను వివరించేందుకే అంకెలతో సహా కరపత్రాల ప్రచారం చేపట్టినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా వివిధ శాఖలకు కేటాయించిన నిధుల వివరాలను వెల్లడించారు. విద్యాశాఖకు రూ.271.81 కోట్లు, నీటిపారుదల శాఖకు రూ.350.68 కోట్లు, వైద్య ఆరోగ్య శాఖకు రూ.45.50 కోట్లు, ఆర్ అండ్ బీ శాఖకు రూ.197.82 కోట్లు, ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 5,500 మంది నిరుపేదలకు రూ.275 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు రూ.212.11 కోట్లు, విద్యుత్ శాఖకు రూ.23.68 కోట్లు, ఎస్డీఎఫ్ నిధుల కింద రూ.15 కోట్లు, మున్సిపల్ శాఖకు రూ.50 కోట్లు, గిరిజన సంక్షేమ శాఖకు రూ.20.78 కోట్లు, రెవెన్యూ శాఖకు రూ.4.50 కోట్లు కేటాయించినట్లు వివరించారు.
అదేవిధంగా స్టేషన్ ఘనపూర్లో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలకు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య కూడా సహకరిస్తున్నారని పేర్కొన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంపై భారీగా అప్పుల భారం పడినప్పటికీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని కొలిపాక సతీష్ అన్నారు. రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్, కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, కొత్త పెన్షన్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ చీరలు, ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన వంటి కార్యక్రమాలను ప్రస్తావించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, ఇతర కాంగ్రెస్ నాయకుల సహకారంతో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా కోఆర్డినేటర్ సత్తిరెడ్డి, జిల్లా నాయకులు జీడీ రమేష్, నక్క పాపయ్య, గట్టు శివకుమార్, చెంతల సతీష్ రెడ్డి, నిల శ్రావణ్, ఆశిష్, రోహిత్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.