విద్య విముక్తికి ఆయుధం – కులవివక్ష నిర్మూలనకు యువత ముందుకు రావాలి: పాలడుగు నాగార్జున

నల్లగొండ, నవంబర్ 28 ఈ69న్యూస్ -తెలుగు గళం

మహాత్మా జ్యోతిబా ఫూలే ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకొని విద్య, సామాజిక సమానత్వం, మహిళా సాధికారత కోసం కృషి చేయాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున పిలుపునిచ్చారు.నల్లగొండలోని స్థానిక బీసీ హాస్టల్‌లో మహాత్మా జ్యోతిబా ఫూలే 136వ వర్ధంతి సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాలడుగు నాగార్జున మాట్లాడుతూ, జ్యోతిబా ఫూలే తన జీవితాన్ని అణగారిన వర్గాల విముక్తి, మహిళా విద్యాభివృద్ధి, కులవివక్ష నిర్మూలన కోసం అంకితం చేసిన గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు.1873లో రచించిన ‘గులాంగిరి’ పుస్తకం ద్వారా కులవ్యవస్థలోని అసమానతలను ఎండగట్టి, శూద్ర, అతిశూద్రుల ఐక్యతతో పాటు విద్య ప్రాధాన్యత, స్వేచ్ఛ, సమానత్వం, ఆత్మగౌరవం ఆవశ్యకతను సమాజానికి చాటిచెప్పారని పేర్కొన్నారు. తన సహచరి సావిత్రిబాయి ఫూలేతో కలిసి మహిళా విద్యకు పునాదులు వేసి, బాలికల విద్యాభివృద్ధి కోసం అనేక అవరోధాలను ఎదుర్కొన్నారని గుర్తుచేశారు.నేటికీ సమాజంలో కులవివక్ష, అంటరానితనం, మహిళలపై హింస, విద్యలో అసమానతలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని నిర్మూలించేందుకు యువత చైతన్యంతో ముందుకు రావాలని కోరారు. కులం పేరుతో మనుషులను విడదీయకుండా శాస్త్రీయ దృక్పథంతో, రాజ్యాంగ విలువలకు అనుగుణంగా సమానత్వ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.విద్యను ఆయుధంగా చేసుకొని అజ్ఞానాన్ని, కులవివక్షను పారద్రోలడమే మహాత్మా జ్యోతిబా ఫూలేకు మనం అర్పించే నిజమైన నివాళి అని పాలడుగు నాగార్జున పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ పట్టణ కార్యదర్శి నరసింహ, లక్ష్మణ్, రమేష్, నరేష్, శ్రీనివాసు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *