3 జీవోను వెంటనే పునరుద్ధరించి చట్టబద్ధం చేయాలి
ఆదివాసుల భూములు, చట్టాల జోలికొస్తే సహించం – 5వ షెడ్యూల్ సెక్షన్ 5(2) ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి”
“1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి – జూలై 26న రాష్ట్రవ్యాప్త ఉద్యమ కార్యాచరణకు వెంకటాపురం వేదిక షెడ్యూల్ ప్రాంతంలో భూమిపై హక్కు పూర్తిగా ఆదివాసీలకే ఉందని, ఆ హక్కును కాదనే అధికారం ఎవరికీ లేదని ఆదివాసి నాయకులు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే 3 జీవోను పునరుద్ధరించి, భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ సెక్షన్ 5(2) ప్రకారం చట్టబద్ధం చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెంకటాపురం మండల కేంద్రంలోని రహదారి విశ్రాంతి భవనంలో ఆదివాసి “లా” అసోసియేషన్ ఆధ్వర్యంలో “1/70 భూ బదలాయింపు నియంత్రణ చట్టం – 3 జీవో పునరుద్ధరణ” అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆదివాసి లా అసోసియేషన్ నాయకులు సున్నం రమేష్, చింత సమ్మయ్య, ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జాతీయ ఉపాధ్యక్షులు యాసం రాజు, రాష్ట్ర కార్యదర్శి మడకం చిట్టిబాబు, గొండ్వాన సంక్షేమ పరిషత్ ప్రధాన కార్యదర్శి పూనెం సాయి దొర, జిల్లా అధ్యక్షులు పూణెం ప్రతాప్ దొర, తుడుం దెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు చింత సోమరాజు, సిద్ధబోయిన సర్వేశ్వరరావు, కుచింటి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో నాయకులు మాట్లాడుతూ, భారత రాజ్యాంగం కల్పించిన 5వ షెడ్యూల్ రక్షణలను పాలక ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని ఆరోపించారు. షెడ్యూల్ ప్రాంతాల్లో ఆదివాసుల భూములు, హక్కులు, సంస్కృతి, జీవన విధానాన్ని దెబ్బతీసే చర్యలు కొనసాగుతున్నాయని, ఇది ఆదివాసి జాతి అస్తిత్వానికే ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివాసుల భూములు గిరిజనేతరుల చేతుల్లోకి వెళ్లకుండా భూ బదలాయింపు నియంత్రణ చట్టం (1/70) తీసుకొచ్చినప్పటికీ, ప్రస్తుతం షెడ్యూల్ ప్రాంతాల్లో భారీ స్థాయిలో భూములు గిరిజనేతరుల ఆధీనంలో ఉండటం చట్టాల అమలులో ప్రభుత్వాల వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. ఆదివాసి చట్టాలను ఉల్లంఘించే వారి పట్ల ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. “ఆదివాసుల చట్టాల జోలికొస్తే గిరిజనేతరుడా ఖబర్దార్” అంటూ నాయకులు హెచ్చరిక చేశారు. ఆదివాసుల భూములు, హక్కులు, రాజ్యాంగ పరిరక్షణలను దెబ్బతీసే కుట్రలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. అదేవిధంగా, తెలంగాణ ప్రభుత్వం 3 జీవోను తక్షణమే పునరుద్ధరించి, 5వ షెడ్యూల్ సెక్షన్ 5(2) ప్రకారం చట్టబద్ధం చేయాలని డిమాండ్ చేశారు. ప్రకృతితో మమేకమై జీవిస్తున్న ఆదివాసుల జీవన హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం రాజ్యాంగబద్ధ బాధ్యతతో ముందుకు రావాలని కోరారు. ఈ సందర్భంగా జూలై 26న వెంకటాపురంలో అన్ని ఆదివాసి సంఘాల సమక్షంలో 1/70 చట్టం, 3 జీవో అంశాలపై విస్తృత సమావేశం నిర్వహించి రాష్ట్రవ్యాప్త ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి మహిళా శక్తి నాయకులు నయుమా, శంకరమ్మ, తుడుం దెబ్బ మండల అధ్యక్షులు కణితి వెంకటకృష్ణ, మండల కార్యదర్శి సున్నం చంటి, దానమయ్యపేట గ్రామస్తులు, మహిళలు, వివిధ ఆదివాసి సంఘాల నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.