బుర్ర సంకీర్తనకు ఘన సన్మానం
తెలుగు గళం న్యూస్ జఫర్ఘడ్, జూన్ 3
జఫర్ఘడ్ మండలం ఉప్పుగల్ గ్రామ ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థిని బుర్ర సంకీర్తన (తండ్రి: తిరుపతి) తన విద్యా ప్రతిభతో గ్రామానికి, పాఠశాలకు మంచి పేరు తీసుకురావడంతో పలువురు ప్రముఖులు ఘనంగా సన్మానించారు.ఇటీవల విడుదలైన పరీక్షా ఫలితాల్లో సంకీర్తన 600 మార్కులకు గాను 562 మార్కులు సాధించడమే కాకుండా, ప్రతిష్టాత్మకమైన బాసర విద్యాసంస్థలో సీటు పొందడం విశేషం. ఈ సందర్భంగా ఆమెను అభినందిస్తూ ప్రత్యేక సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పోతోజు ఎల్లచారి (కునూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాల మాజీ చైర్మన్), చెగొండ రమేష్ (హిందూ ధర్మ ప్రచార అధ్యక్షులు), శాశ్రబోయిన సంపత్ (ముదిరాజ్ సంఘం అధ్యక్షులు), పల్లె రాజిరెడ్డి (ప్రభుత్వ పాఠశాలల మండల పర్యవేక్షణ అధికారి ప్రతినిధి) పాల్గొని విద్యార్థినిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు కూడా కృషి, పట్టుదలతో అత్యున్నత ఫలితాలు సాధించగలరని సంకీర్తన నిరూపించిందన్నారు.ఆమె సాధించిన విజయం ఇతర విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లిదండ్రులకు, పాఠశాలకు, గ్రామానికి మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు.