8ఏళ్ల వేధింపులు.. చివరకు ప్రాణాలు తీసుకున్న ప్రియాంక
భర్త రెండో వివాహం, కుటుంబ వేధింపులే కారణమని ఆరోపణలు – కేసు నమోదు వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం చంద్రుతండ గ్రామంలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత ఆత్మహత్యాయత్నం చేసి చికిత్స పొందుతూ మృతి చెందిన విషాద ఘటన వెలుగులోకి వచ్చింది.గ్రామానికి చెందిన భూక్య ప్రియాంక (33)కు సుమారు 18 సంవత్సరాల క్రితం అదే గ్రామానికి చెందిన భూక్య రవి (40)తో వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.వివాహానంతరం మొదటి ఎనిమిదేళ్లు దాంపత్య జీవితం సజావుగా సాగినప్పటికీ, అనంతరం రవి మరో మహిళను వివాహం చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.దీంతో భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు చోటుచేసుకున్నాయని, గ్రామ పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయతీలు జరిగినప్పటికీ సమస్యకు పరిష్కారం లభించలేదని సమాచారం. భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులు శారీరకంగా, మానసికంగా వేధించారని మనస్తాపానికి గురైన ప్రియాంక గడ్డి మందు సేవించింది.ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ, జూలై 21న పరిస్థితి విషమించి మృతి చెందింది.ప్రియాంక మృతిపై అనుమానాలు ఉన్నాయని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వర్ధన్నపేట పోలీస్ స్టేషన్లో భర్త రవి మరియు అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడికానున్నాయి.