మోకాళ్ల లోతు బురదలో మునిగిన పాఠశాల
కొత్తగూడెం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని 21వ డివిజన్లో ఉన్న డేగలమడుగు గ్రామంలో విద్యార్థుల బాధలకు చివరికి పరిష్కారం దొరికింది. రోడ్డు స్థాయి కంటే చాలా దిగువన ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రాంగణం వర్షాకాలం రాగానే మోకాళ్ల లోతు నీటితో నిండిపోయి బురదమయంగా మారేది. దీంతో చిన్నారులు, ఉపాధ్యాయులు పాఠశాలలోకి అడుగుపెట్టడమే ఒక పెద్ద సవాలుగా మారింది.
ఎన్నోసార్లు ప్రజాప్రతినిధులకు విన్నవించినా స్పందన లేకపోవడంతో గ్రామస్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే, ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల సమయంలో స్థానిక ప్రజలు, ఉపాధ్యాయుల అభ్యర్థనపై 21వ డివిజన్ కార్పొరేటర్ దంపతులు చింతలపూడి శ్రావణి – సాయి కుమార్ పాఠశాల మౌలిక వసతుల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఇచ్చిన మాటకు కట్టుబడి, ఈ రోజు వారు సుమారు రూ.15,000 విలువైన గ్రావెల్‌ను తమ సొంత ఖర్చులతో పాఠశాల ప్రాంగణంలో వేయించారు. దీంతో బురదతో నిండిపోయిన ప్రదేశం ఇప్పుడు విద్యార్థులు సులభంగా నడిచేలా మారింది.
ఈ సేవా కార్యక్రమంపై గ్రామస్థులు, ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేస్తూ కార్పొరేటర్ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకుని తక్షణమే స్పందించిన వారి ఔన్నత్యాన్ని కొనియాడారు.
ఒక చిన్న నిర్ణయం… వందలాది చిన్నారుల చదువు ప్రయాణానికి వెలుగుదారి చూపింది!