ఎస్ఐఆర్ పై తీవ్ర విమర్శలు – “రక్తపాతం లేని నరమేధం”
దేశంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణలు ఎస్ఐఆర్ పేరుతో జరుగుతున్న ప్రక్రియపై రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు పరాకాల ప్రభాకర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది “రక్తపాతం లేని నరమేధం”తో సమానమని వ్యాఖ్యానిస్తూ, దీనిని తేలికగా తీసుకోరాదని ప్రజలకు, రాజకీయ నాయకులకు సూచించారు.ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా హైకోర్టు సీనియర్ అడ్వకేట్ జి. విద్యాసాగర్ అధ్యక్షత వహించగా, డీజీ నర్సింహారావు, ఉమామహేశ్వరరావు, డీఏఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.పరాకాల ప్రభాకర్ మాట్లాడుతూ… దేశంలో ప్రతి ఏడాది అక్టోబర్ నుంచి జనవరి మధ్య ప్రత్యేక సంక్షిప్త సవరణ జరుగుతుండగా, మళ్లీ ఎస్ఐఆర్ అవసరం ఏమిటని ప్రశ్నించారు. ఎస్‌ఎస్‌ఆర్‌లో అవకతవకలు ఉన్నాయన్న ఎన్నికల సంఘం వ్యాఖ్యలు ఆశ్చర్యకరమని, తమ పనిపై తమకే నమ్మకం లేదా అని నిలదీశారు.సమాచార హక్కు చట్టం కింద ప్రశ్నలు అడిగితే ఎన్నికల సంఘం సరైన సమాధానాలు ఇవ్వలేకపోయిందని విమర్శించారు. ఎస్ఐఆర్ అమలు నిర్ణయం ఎక్కడ తీసుకున్నారన్న విషయంపైనా స్పష్టత లేదన్నారు.దేశవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో ఓటర్లను తొలగిస్తున్నారని ఆరోపిస్తూ, ఇప్పటివరకు సుమారు 6.5 కోట్ల ఓట్లు తొలగించారని, మొత్తం 16.5 కోట్ల ఓట్లను తొలగించే లక్ష్యంతో ఈ ప్రక్రియ సాగుతోందని పేర్కొన్నారు. తొలగించిన ఓటర్లలో మైనార్టీలు, దళితులు, ఆదివాసీలు, మహిళలు, నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్నారని తెలిపారు.బీహార్, తమిళనాడు,గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో లక్షల నుంచి కోట్ల వరకు ఓట్లు తొలగించినట్లు ఉదాహరణలు ఇచ్చారు.కానీ తొలగించిన ఓట్ల వివరాల్లో “చొరబాటుదారులు” అనే విభాగం లేకపోవడాన్ని ప్రశ్నించారు.కొన్ని ప్రాంతాల్లో తాము చేసిన సర్వేలో ఒకే ఇంటి చిరునామాతో వందలాది ఓట్లు నమోదైన ఘటనలు బయటపడ్డాయని తెలిపారు. పేక్ అడ్రస్‌లతో కోట్ల సంఖ్యలో ఓట్లు చేర్చినట్లు గుర్తించామని చెప్పారు.ఓటు హక్కు లేకపోతే ప్రజలు ద్వితీయ శ్రేణి పౌరులుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.ఓటు లేకుంటే సంక్షేమ పథకాలు కూడా దూరమయ్యే పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు.తెలంగాణలో ఎస్ఐఆర్ చేపట్టే ముందు రాష్ట్ర ఎన్నికల సంఘం ద్వారా ఓటర్ జాబితా సేకరించాలని సూచించారు. గ్రామ సభల ద్వారా ఓటర్ జాబితాను ఖరారు చేయాలని డిమాండ్ చేశారు.రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజలు ఉద్యమించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.