వైద్య కళాశాల హాస్టల్ నిర్మాణ పనులను సత్వరమే పూర్తి చేయాలి
జిల్లాలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల వైద్య విద్యార్థుల వసతి గృహ (హాస్టల్) భవన పనులను యుద్ధ ప్రాతిపదికన వేగవంతం చేసి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు.శనివారం ఐడీఓసీ కార్యాలయంలో ఆర్ అండ్ బి, వైద్య కళాశాల అధికారులు మరియు టీజీఎంఐడీసీ ఇంజినీరింగ్ విభాగం ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిర్మాణ పనులకు సంబంధించి ప్రభుత్వం నుంచి నిధుల కొరత లేదని, బిల్లుల చెల్లింపులు సక్రమంగా జరుగుతున్నాయని ఈ సందర్భంగా కలెక్టర్ స్పష్టం చేశారు. చెల్లింపులు సకాలంలో అందుతున్నప్పటికీ పనుల్లో జాప్యం జరగడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. నిర్మాణ పనుల్లో వేగం పెంచేందుకు వెంటనే అదనపు కూలీలను (లేబర్ మొబిలైజేషన్) రంగంలోకి దింపాలని కాంట్రాక్టర్లకు, అధికారులకు సూచించారు.ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి వైద్య విద్య అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయ్యేలోపు, విద్యార్థులు కళాశాలకు వచ్చే సమయానికి భవనాలన్నీ సిద్ధంగా ఉండాలని కలెక్టర్ కచ్చితమైన గడువు విధించారు. కేవలం భవన నిర్మాణమే కాకుండా, విద్యార్థులకు అవసరమైన బెడ్స్, ఫర్నిచర్ మరియు ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాటులో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి, నిర్దేశిత కాలపరిమితిలోగా పనులను పూర్తి చేయాలని హితవు పలికారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, ఆర్ అండ్ బి ఈఈ రమేష్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశ్వరరావు, జిల్లా ప్రధాన ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ రాజేంద్రప్రసాద్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్, టీజీఎంఎస్ఐడీసీ ఏఈ రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.