గ్రామ అభివృద్ది కమిటీ చైర్మన్,మాజీ మార్కెట్ చైర్మన్, అన్నం బ్రహ్మారెడ్డి
తమ్మడపల్లి జి గ్రామంలో వేసవి ఉచిత కరాటే శిబిరాన్ని ప్రారంభించిన అన్నం బ్రహ్మారెడ్డి
తెలుగు గళం న్యూస్ జఫర్ఘడ్ మే03
జఫర్ఘడ్ మండలం తమ్మడపల్లి జి గ్రామంలో వేసవి ఉచిత కరాటే శిక్షణ శిబిరం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. జిల్లా యువజన క్రీడాశాఖ (డివైఎస్ఓ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిబిరాన్ని గ్రామ అభివృద్ది కమిటీ చైర్మన్,మాజీ మార్కెట్ చైర్మన్, అన్నం బ్రహ్మారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ సందర్భంగా అన్నం బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో విద్యార్థులకు విద్యతో పాటు శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ ఎంతో అవసరమని పేర్కొన్నారు.కరాటే వంటి యుద్ధకళలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా, స్వీయ రక్షణ నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేస్తాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి శిక్షణ శిబిరాలు నిర్వహించడం ద్వారా పిల్లలు మంచి దారిలో ముందుకు సాగుతారని తెలిపారు.శిబిరం నిర్వహణలో భాగంగా అనుభవజ్ఞులైన కోచ్ అన్నెపు రాజేంద్రం ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రాథమిక కరాటే శిక్షణ, శారీరక వ్యాయామాలు, స్వీయ రక్షణ పద్ధతులు బోధించనున్నారు. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా ఈ శిబిరం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు.కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచి ముక్కెర గంగరాజు, నక్క అజయ్, కాసారబోయిన రాజు, ఎండీ ఖాసీం తదితరులు పాల్గొని శిబిరానికి మద్దతు తెలిపారు.గ్రామంలోని విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహంగా శిక్షణలో పాల్గొన్నారు.ఈ శిబిరం ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, ధైర్యం, ఆరోగ్యంపై అవగాహన పెంపొందుతుందని గ్రామ పెద్దలు ఆశాభావం వ్యక్తం చేశారు.