




తిరుమలగిరిలో రైతుల ఆగ్రహం
ఈ69న్యూస్ రేగొండ మే26
భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని తిరుమలగిరి గ్రామంలో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ పాడి ఆవు కరెంట్ షాక్కు గురై మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది.గ్రామానికి చెందిన రైతు ఓరువల రాజుకు చెందిన సుమారు రూ.40 వేల విలువైన ఆవు గ్రామ శివారులోని పొలాల వద్ద మేత మేస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాన్స్ఫార్మర్ను తాకింది.దీంతో ఒక్కసారిగా తీవ్ర విద్యుత్ షాక్కు గురైన ఆవు అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.షాక్ తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే ట్రాన్స్ఫార్మర్ చుట్టుపక్కల ఉన్న పచ్చిక గడ్డి కూడా పూర్తిగా కాలిపోయినట్లు స్థానికులు తెలిపారు. తన జీవనాధారమైన పాడి ఆవు కళ్లముందే మృతి చెందడంతో రైతు ఓరువల రాజు కన్నీరుమున్నీరుగా విలపించాడు.సమాచారం అందుకున్న గ్రామ రైతులు, స్థానికులు పెద్ద సంఖ్యలో ఘటనాస్థలికి చేరుకుని విద్యుత్ శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పొలాల మధ్యలో ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ కొన్ని నెలలుగా కిందికి వాలిపోయి ప్రమాదకర స్థితిలో ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ విషయాన్ని పలుమార్లు స్థానిక ఏఈ, డీఈల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని రైతులు వాపోయారు.“నేడు మూగజీవం బలైంది.. రేపు రైతులు లేదా కూలీల ప్రాణాలకు ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది?” అంటూ రైతులు ప్రశ్నించారు. వెంటనే ప్రమాదకర ట్రాన్స్ఫార్మర్ను సరిచేసి భద్రతా చర్యలు చేపట్టాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే బాధిత రైతు ఓరువల రాజుకు తక్షణ నష్టపరిహారం అందించాలని కోరారు.డిమాండ్లు నెరవేర్చకపోతే విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని రైతులు హెచ్చరించారు.