
ఈ69న్యూస్ వరంగల్ మే25
నేరాల నియంత్రణే ధ్యేయంగా, పాత నేరస్తులను గుర్తించేందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు విస్తృతంగా నాకాబంది (వాహన తనిఖీలు) నిర్వహించారు. ఈ తనిఖీల్లో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ స్వయంగా క్షేత్రస్థాయిలోకి దిగి, ప్రత్యక్షంగా పాల్గొన్నారు.కాజీపేట పరిధిలోని కడిపికొండ, భట్టుపల్లి ప్రాంతాల్లో పోలీస్ కమిషనర్.. స్థానిక పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వాహనాల పత్రాలను పరిశీలించడంతో పాటు, రాత్రి వేళల్లో రాకపోకలు సాగిస్తున్న వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు.డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు:వాహన తనిఖీలతో పాటు అదే సమయంలో ఆయా ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను కూడా నిర్వహించారు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారే వారిపై కఠినంగా వ్యవహరించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపి అధికారులను ఆదేశించారు.శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల భద్రతకు కమిషనరేట్ పరిధిలో ఇలాంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఈ సందర్భంగా ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.