హమాలీ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి-ఎం. సాయిబాబు
తెలంగాణ రాష్ట్రంలోని హమాలీ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక వెల్ఫేర్ బోర్డును ప్రభుత్వం తక్షణమే ఏర్పాటు చేయాలని సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం. సాయిబాబు డిమాండ్ చేశారు. తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) రాష్ట్ర 4వ మహాసభ శనివారం జనగామ పట్టణంలోని గ్లోరీ ఫంక్షన్ హాల్లో ఘనంగా, ఉత్తేజపూరిత వాతావరణంలో నిర్వహించారు.అమరజీవి బొట్ల శ్రీనివాస్ ప్రాంగణం, ఎర్ర శ్రీకాంత్ నగర్ పేరుతో జరిగిన ఈ మహాసభకు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో హమాలీ కార్మికులు, ప్రతినిధులు హాజరయ్యారు.కార్యక్రమానికి ముందు మద్ది సత్యం జెండా ఆవిష్కరించగా, భూక్య శ్రీనివాస్, రాపర్తి రాజు, సత్యం అధ్యక్షవర్గంగా వ్యవహరించారు.ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎం. సాయిబాబు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది హమాలీ కార్మికులు అసంఘటిత రంగంలో పనిచేస్తూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వారికి గుర్తింపు కార్డులు, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, వృద్ధాప్య పెన్షన్, గృహ వసతి, పిల్లల విద్యా సహాయం వంటి సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రత్యేక వెల్ఫేర్ బోర్డు అవసరమని పేర్కొన్నారు.మార్కెట్ యార్డులు, గోదాములు, రవాణా రంగాల్లో పనిచేస్తున్న హమాలీలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కీలక సేవలు అందిస్తున్నప్పటికీ, వారికి కనీస సంక్షేమ సౌకర్యాలు కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.కార్మిక చట్టాలను కఠినంగా అమలు చేసి కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.హమాలీల నమోదు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు ఈ-శ్రమ్ మరియు ఇతర సామాజిక భద్రతా పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని మహాసభ డిమాండ్ చేసింది. అలాగే మార్కెట్ యార్డులు, గోదాములు, లోడింగ్-అన్లోడింగ్ కేంద్రాల్లో పనిచేసే కార్మికులకు రక్షణ పరికరాలు, తాగునీరు, విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని కోరింది.పని సమయంలో ప్రమాదాలకు గురైన హమాలీలకు తక్షణ నష్టపరిహారం అందించే విధానాన్ని అమలు చేయాలని, కాంట్రాక్టర్లు మరియు మధ్యవర్తుల దోపిడీని అరికట్టి కనీస వేతనాల చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని తీర్మానించింది.సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ నిరంతరం పోరాటాలు నిర్వహిస్తోందని తెలిపారు.తెలంగాణలో హమాలీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.ఈ మహాసభలో తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరు రాములు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు కాసు మాధవి, పుప్పాల శ్రీకాంత్, పాలడుగు సుధాకర్, రాష్ట్ర నాయకులు యాటల సోమన్న, సీఐటీయూ జిల్లా కార్యదర్శి సుంచు విజయేందర్, వివిధ జిల్లాల నాయకులు గుమ్మడి రాజు, నరేష్, దాసరి పాండు, బొట్ల చక్రపాణి, ఆరూరి కుమార్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి భూక్య చందునాయక్, మత్స్యకార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మునిగేల రమేష్, సీఐటీయూ నాయకులు అన్నెబోయిన రాజు, బైరగోని బాలరాజు, చిట్యాల సోమన్న, బూడిది ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దసగోని సుమ, ప్రజాసంఘాల నాయకులు దూసరి నాగరాజు, కచ్చగాళ్ల వెంకటేష్, చిర్ర శ్రీను, పొదల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.మహాసభలో హమాలీ కార్మికుల సంక్షేమం, కార్మిక హక్కుల పరిరక్షణ, సామాజిక భద్రతా పథకాల అమలు, రైతు-కార్మిక ఐక్యత బలోపేతం తదితర అంశాలపై పలు కీలక తీర్మానాలను ఆమోదించారు.