ఏఐకె ఎం ఎస్ నేత రాచర్ల బాలరాజు
ఏఐకె ఎం ఎస్ నేత రాచర్ల బాలరాజు
*పెరిగిన ధరలకు అనుగుణంగా కూలీల వేతనం పెంచాలి ఏనుగల్లులో కూలీలతో సమావేశం
తెలుగు గళం న్యూస్ పర్వతగిరి /జూన్ 9
వరంగల్ జిల్లా:ఉపాధి హామీ పథకానికి ఇచ్చే నిధులను కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా భరించాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా కూలీల వేతనాలను పెంచాలని అఖిల భారత రైతు కూలి సంఘం (ఏఐకేఎంఎస్) ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాచర్ల బాలరాజు డిమాండ్ చేశారు. పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్న కూలీలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ,కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గతంలో ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని సవరణల పేరుతో రద్దు చేసి కూలీల హక్కులను హరించివేసిందని ఆరోపించారు.
2005 చట్టం కొత్త చట్టం:
2005లో యూపీఏ ప్రభుత్వం దేశవ్యాప్త ఆందోళనల ఫలితంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చిందని ఆయన గుర్తు చేశారు. అయితే మోడీ ప్రభుత్వం 2024 డిసెంబర్లో ‘విబి జి రాంజీ’ అనే నూతన చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించిందని తెలిపారు.నిధుల భారంపై ఆందోళన:గత చట్టం ప్రకారం ఉపాధి హామీ పనులకు 100% నిధులను కేంద్రమే భరించేది. కానీ కొత్త చట్టం ప్రకారం కేంద్రం 60%,రాష్ట్రం 40% భరించాలి. ఇది క్రమంగా పథకాన్ని ఆపివేసే కుట్ర”అని బాలరాజు ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ నిధులు, ఇతర పార్టీల ప్రభుత్వాలకు తక్కువ నిధులు కేటాయిస్తున్నారని విమర్శించారు.పంచాయతీల అధికారాలకు కోత:గతంలో గ్రామ పంచాయతీలకు పనుల ఎంపికలో కొంత అధికారం ఉండేదని, కొత్త చట్టంతో కేంద్రం చెప్పిన పనులే చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగపరంగా రాష్ట్రాలకు ఉన్న అధికారాలను కేంద్రం క్రమంగా తగ్గిస్తోందని మండిపడ్డారు. ఆందోళనకు హెచ్చరిక:
కొత్త చట్టం వల్ల కరువు కూలీలకు జరిగే అన్యాయానికి వ్యతిరేకంగా రైతు, కూలీ సంఘాల ఆధ్వర్యంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని రాచర్ల బాలరాజు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.