పాండవుల గుట్టను సందర్శించిన పర్యాటక శాఖ ఏఈ
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశ్రీశ్రీ బుగులోని వెంకటేశ్వర స్వామి జాతరను పర్యాటకంగా ఎంతో అభివృద్ధి పరిచేందుకు భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ప్రత్యేక ప్రణాళికలతో ముందడుగు వేస్తున్నారు.క్షేత్ర పరిధిలో భక్తులకు అత్యాధునిక మౌలిక వసతుల కల్పన కోసం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రత్యేక చొరవ తీసుకుని, సుమారు రూ.4 కోట్ల వ్యయంతో కూడిన భారీ నిధుల అంచనాలు,ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించారు. ఈ నేపథ్యంలో పర్యాటక శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ ఆర్.కీర్తి కుమార్ ఆలయ పరిసరాలను క్షేత్రస్థాయిలో సందర్శించి,ప్రతిపాదిత అభివృద్ధి పనులను అత్యంత క్షుణ్ణంగా పరిశీలించారు.ఈ పరిశీలనలో భాగంగా జాతర ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం రూ.4 కోట్ల నిధులతో చేపట్టాల్సిన పలు కీలక నిర్మాణాలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా గుట్ట కింది భాగం నుండి పైకి వెళ్లే భక్తులకు కఠినమైన ఎండ, వానల నుండి ఉపశమనం కలిగించేలా ప్రహరీ మార్గంలో రక్షణ రేకుల (షెల్టర్స్) ఏర్పాటు చేయడం, ఆలయ ప్రాశస్త్యం ఉట్టిపడేలా నూతన రాజగోపురం నిర్మించడం, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల రద్దీకి అనుగుణంగా కల్యాణ మండపాన్ని మరింత విస్తరించడం వంటి పనులను ఏఈ పరిశీలించారు. వీటితో పాటు ఆలయానికి వచ్చే భక్తుల కోసం అత్యాధునిక డైనింగ్ హాల్, సుదూర ప్రాంతాల నుండి వచ్చే వారి కొరకు వసతి గృహాలు (అతిథి గృహాలు), షాపింగ్ కాంప్లెక్స్ సముదాయం, ఆలయ ప్రధాన అర్చకుల కొరకు ప్రత్యేక గదుల (పూజారి రూమ్స్) నిర్మాణ స్థలాలను ఆయన పర్యవేక్షించి,ఉన్నతాధికారులకు త్వరలోనే సమగ్ర నివేదిక సమర్పించనున్నట్లు తెలిపారు.ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆకాంక్షకు అనుగుణంగా బుగులోని క్షేత్రాన్ని రూ.4 కోట్లతో అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు వేగంగా అడుగులు పడుతుండటంపై స్థానికులు,భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ క్షేత్రస్థాయి పరిశీలన కార్యక్రమంలో బుగులోని జాతర కమిటీ చైర్మన్ గంగుల రమణారెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు కురుమచలం వెంకటేశ్వర్లు,కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు నిమ్మల విజేందర్, కాంగ్రెస్ నాయకులు మంతెపూరి తిరుపతి, ఆలయ సిబ్బంది,స్థానిక భక్తులు పాల్గొన్నారు.