అంబేద్కర్ స్టేడియంలో ఘనంగా ‘స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ ఆన్ వీల్స్
క్రీడాకారుల నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు ఆధునిక క్రీడా పరిజ్ఞానాన్ని గ్రామీణ స్థాయికి చేరవేయడమే లక్ష్యంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.వైస్ చైర్మన్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఉత్తర్వుల మేరకు, శనివారం జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ స్టేడియంలో ‘స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ ఆన్ వీల్స్’ కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా నిర్వహించారు.స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నుండి ప్రత్యేకంగా జిల్లాకు విచ్చేసిన నిష్ణాతులైన క్రీడా శిక్షకులు (కోచ్‌లు) ఈ ఒకరోజు శిక్షణ శిబిరంలో పాల్గొని,క్రీడల్లో వస్తున్న ఆధునిక మార్పులపై సమగ్రమైన అవగాహన కల్పించారు.ముఖ్యంగా అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్ క్రికెట్ క్రీడలకు సంబంధించిన అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలను, సరికొత్త నియమ నిబంధనలను జిల్లాలోని ఫిజికల్ డైరెక్టర్లు,ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు,వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు క్రీడాకారులకు ప్రాక్టికల్ పద్ధతిలో వివరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా యువజన క్రీడాధికారి రఘు మాట్లాడుతూ,రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ‘స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ ఆన్ వీల్స్’ అవకాశాన్ని జిల్లాలోని పీడీలు, పీఈటీలు, క్రీడాకారులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.క్రీడల్లో రాణించడానికి కేవలం ప్రతిభ మాత్రమే సరిపోదని, మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక మెలకువలను అలవర్చుకోవాలని సూచించారు. క్రీడాకారులకు మైదానంలో ఎదురయ్యే శారీరక సమస్యలు, గాయాల నివారణ మరియు అత్యవసర సమయాల్లో అందించాల్సిన ఫిజియోథెరపీ చికిత్సల ప్రాధాన్యతపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇటువంటి శిక్షణా శిబిరాలు జిల్లా నుండి భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ఉద్భవించడానికి ఎంతగానో దోహదపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.క్రీడారంగ ఉపాధ్యాయులు ఇక్కడ నేర్చుకున్న మెలకువలను పాఠశాల స్థాయి నుండి విద్యార్థులకు బోధించి వారిని ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని కోరారు.ఎంతో ఉత్సాహభరితంగా సాగిన ఈ బృహత్తర శిక్షణ కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా తరలివచ్చిన శారీరక విద్యా దర్శకులు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడా సంఘాల ప్రముఖులు, వర్ధమాన క్రీడాకారులు,పాఠశాల కళాశాల విద్యార్థులు,క్రీడా శాఖ కార్యాలయ సిబ్బంది శివసాగర్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.